Capital Amaravati: రాజధాని అమరావతికి రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హౌసింగ్, అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ముందుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ హడ్కో సీఎండీతో నిర్వహించిన భేటీలో.. రుణం ఇచ్చేందుకు హడ్కో తన సమ్మతాన్ని తెలిపిందని వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.15 వేల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు మొత్తంగా అమరావతి కోసం తెస్తున్న అప్పు రూ.27 వేల కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ డ్ ప్రాజెక్టు అని.. రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. కేవలం భూమి, నీరు ఇస్తే.. రాజధాని దానికదే అభివృద్ధి చెందుతుందని అమరావతి పునర్నిర్మాణ పనుల సందర్భంలో సైతం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ప్రపంచబ్యాంకు నుంచి ఇప్పించాల్సిన అవసరం ఏముందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇవి కాక హడ్కో నుంచి మరో రూ. 11 వేల కోట్ల రుణం తీసుకోవాలనుకోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 2021 నవంబర్ 23 నాటి లెక్కల ప్రకారం అమరావతి అభివృద్ధి పేరుతో జరిగిన ఖర్చు రూ.8,572 కోట్లు. అందులో మౌలిక సదుపాయాల మీద చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు.
మిగిలిన రూ.3 వేల కోట్లు వడ్డీలు, కన్సల్టెన్సీ ఛార్జీలు, కౌలు చెల్లింపు, పెన్షన్ల కోసం చెల్లించారు. ఈ సొమ్ములో రూ.2 వేల కోట్లు గతంలో అమరావతి బాండ్ల రూపంలో చంద్రబాబు సర్కారు సేకరించింది. ఈ బాండ్ల కాలవ్యవధి పదేళ్లు, ఈ బాండ్లకు మర్చంట్ బ్యాంకర్(మధ్యవర్తి)గా మెస్సర్స్ ఎ.కె.క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను నియమించారు.
రూ.2 వేల కోట్ల అప్పునకు పదేళ్లలో రూ.1,573.73 కోట్లు వడ్డీ చెల్లించారు. ఎ.కె.క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు ఫీజుగా 0.85 శాతం అంటే పదేళ్లకు 17 కోట్లు, దానిపై జీఎస్టీ ఖర్చులు సైతం చెల్లించారు. పుణే నగరపాలక సంస్థ 7.59 శాతం, హైదరాబాద్ నగరపాలక సంస్థ 8.9 శాతం, మరో విడత 9.38 శాతం వడ్డీ రేట్లతో బాండ్లపై రుణం తీసుకుంటే..అమరావతి నిర్మాణానికి రూ.10.32 శాతం వడ్డీ చెల్లించడానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
కౌలుకు ఇచ్చింది ఎంత?
అమరావతి నిర్మాణానికి గతంలో 28 వేల 656 మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారు. వీరికి 2014 నుంచి ప్రభుత్వం ఏటా కౌలు చెల్లిస్తూ వస్తోంది. తొలుత పదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని నిర్ణయించారు.
టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు కూడా అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తూ వచ్చింది. ముందుగా అనుకున్న పదేళ్ల గడువు ఇటీవల ముగియగా.. కూటమి ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. ఏటా 200 కోట్ల వరకు కౌలు సొమ్ము కింద రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. 2 వేల కోట్లకు పైగా ఇప్పటికే చెల్లించారు. మరో ఐదేళ్లకు 1000 కోట్లు అనుకుంటే.. మొత్తం రూ.3 వేల కోట్లు కౌలుకే చెల్లిస్తున్న పరిస్థితి.
రైతులకు చెల్లిస్తున్న ఈ కౌలు డబ్బులతో ఏకంగా రాజధానినే నిర్మించవచ్చని, అందుకు ఛత్తీస్ ఘర్ రాజధాని రాయ్ పూర్ నిర్మాణమే తార్కాణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో సచివాలయానికి అయిన ఖర్చు రూ. 1140 కోట్లు మాత్రమే. ఇవన్నీ పరిశీలిస్తే.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ డ్ ప్రాజెక్టు ఎలా అవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ కొత్త అప్పులతో ప్రజల నెత్తిన మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: Amaravati: నాడు వద్దన్న బారికేడ్లు.. ఇప్పుడు ఎందుకొస్తున్నాయి?
Amaravati R5 Zone issue: అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
Purandeswari on amaravati: రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉంది: పురంధేశ్వరి
Amaravati Houses: 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన.. సామాజిక అమరావతికి పునాది వేశామన్న సీఎం జగన్
