Amaravati R5 Zone issue: అమరావతితో పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఆపేయాలని హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నంబర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని అమరావతి రైతులు కొందరు కోరారు. ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కొందరు రాజధాని రైతులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. (Amaravati R5 Zone issue)
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో గత నెల 24న సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిజంగా రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుందని ఆ సభలో సీఎం జగన్ చెప్పారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నోఅవరోధాలు అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో జరుగుతోందన్నారు.
ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిలిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఆయన దుష్ట చతుష్టయమని జగన్ మండిపడ్డారు. ఇతరత్రా చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు కూడా ఇందుకు తోడయ్యాయని గుర్తు చేసిన సంగతి తెలిసిందే.
వీరంతా చివరి వరకు ఒక పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆరోజు సీఎం మండిపడ్డారు. ఈరోజుటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారని, ఆ తర్వాత పేదలకు ఇళ్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారని గుర్తు చేశారు.
తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు ఇవ్వడానికి వీల్లేదంటూ కొందరు రైతులు, వారి పక్షాన ప్రధాన ప్రతిపక్షం కోర్టు మెట్లెక్కాయి. మరోవైపు సీఎం జగన్ మాత్రం ఇది ప్రజా అమరావతి అని, పేదలందరి అమరావతి అంటూ పేదలకోసం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.