Amaravati Houses: 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన.. సామాజిక అమరావతికి పునాది వేశామన్న సీఎం జగన్‌

Amaravati Houses: అమరావతిలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 50 వేల మందికిపైగా పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు పత్రాలు అందజేశారు. సీఆర్డీఏ పరిధిలో నిరుపేదలకు ఇటీవలే ఇంటి పట్టాలిచ్చిన సీఎం జగన్‌.. తాజాగా ఇంటి నిర్మాణం మంజూరు పత్రాలు ఇచ్చారు. పేదల కోరిక మేరకు ఇంటి నిర్మాణాలు కూడా ప్రభుత్వమే చేస్తుందని జగన్‌ ప్రకటించారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం, వెంకటపాలెంలో 25 లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు మొదలు కానున్నాయి. (Amaravati Houses)

గుంటూరు జిల్లా వెంకటపాలెం బహిరంగ సభలోసీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. నిజంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుందని చెప్పారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నోఅవరోధాలు అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో జరుగుతోందన్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిలిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక దత్తపుత్రుడన్నారు. ఇతరత్రా చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు కూడా ఇందుకు తోడయ్యాయన్నారు. వీరంతా చివరి వరకు ఒక పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకొనే ప్రయత్నం చేశారని సీఎం మండిపడ్డారు. ఈరోజుటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారని, ఆ తర్వాత పేదలకు ఇళ్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారని గుర్తు చేశారు. (Amaravati Houses)

హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేశారు..

“ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఇళ్లు రాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లిన పరిస్థితులు.. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు, గజదొంగ ముఠా, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. మూడేళ్లపాటు వీళ్లు వేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరఫున మీ బిడ్డ వీళ్లందరితో పోరాటం చేస్తూ వచ్చాడు. చివరికి దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులు మంచికే ఉంటాయి కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని ఇళ్ల పట్టాలివ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా వీరి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి ఇళ్లు నిర్మాణం కూడా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడప లేదు. దిగని గడప లేదు. కలవని కేంద్ర సెక్రటరీ కూడా లేడు. ఇంత మంది కలిసి చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. దేవుడి దయతో అన్నింటినీ అధిగమించి అడుగులు ముందుకు వేశాం. మీ ఇంటి కలల సాకారానికి ఈరోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తున్నాం. ప్రతి విషయంలోనూ కూడా మన పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోంది.

రాక్షస బుద్ధితో అడ్డు తగులుతున్నారు..

పేదవాడికి ఏ మంచి జరిగినా అడ్డుకొనే రాక్షస బుద్ధితో మనం ఈరోజు యుద్ధం చేస్తున్నాం. పేద పిల్లలకు గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం పెడుతున్నప్పుడు పెత్తందార్లంతా అడ్డు తగిలే ప్రయత్నంచేశారు. పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లిష్‌ మీడియం బడులకు పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకు పోవాలి అంటారు. తెలుగు భాష ఏమవుతుందని చెప్పి ముసలి కన్నీరు కారుస్తారు. ప్రతి అడుగులోనూ వారిది ఇదే ఆలోచన.

మీ బిడ్డ పేదల కోసం బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా మనందరి ప్రభుత్వం నేరుగా 2.25 లక్షల కోట్లు ఖాతాల్లోకి పంపిస్తుంటే దాన్ని కూడా అడ్డుకొనే కార్యక్రమం.. ఇలా మీ బిడ్డ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పెత్తందార్లంతా గగ్గోలు పెడతారు. ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్‌ అప్పట్లో చంద్రబాబు హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్‌ రేటు కూడా తక్కువ. మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతున్నాడు. ఆ రోజు ఆ గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది?

కులాల మధ్య సముతుల్యం దెబ్బ తింటుందట..

ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు. ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్కాచెల్లెళ్లకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకొనేందుకు కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్‌ ఇంబ్యాల్స్‌ వస్తుందట.. కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులు, ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్దం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన మనషుల్ని, మనస్తత్వాల్ని, వాదనల్ని, రాతల్ని, టీవీ డిబేట్లను, రాజకీయ పార్టీల్ని మానసిక, నైతిక దివాళాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా?

ఏ సమాజమైనా, ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుంది? నిన్నటికంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటారు. ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు. అమానుషత్వం అంటారు. రాక్షసత్వం అంటారు. ఇంత రాక్షసత్వం ఒకవైపు చూపిస్తున్నారు. అన్యాయం చేస్తున్నారు. పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు.పేద వర్గాల మీద పేద కులాలమీద పెత్తందార్ల దోపిడీలను సహించి, భరించే కాలం పోయింది. ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది.

మార్పుకు సహకరించే ప్రభుత్వం…

అటువంటి మార్పుకు సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఇక్కడి నుంచి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి ఈ అమరావతి మనందరి అమరావతి కాబోతోందని తెలియజేస్తున్నా. ఇదే ప్రాంతంలో అక్షరాలా 50793 మంది నా అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని అడిగారు. మంగళగిరి, తాడికొండ పరిధిలో 1400 ఎకరాల్లో 25 లేఅవుట్లలో అభివృద్ది చేసి నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. అభివృద్ధిలో భాగంగా ల్యాండ్‌ లెవలింగ్‌, ప్లాట్ల సరిహద్దురాళ్లు పాతాం. 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

ప్రతి లేఅవుట్‌ వద్దకు వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి, ఆ ఇంటి స్థలంలో ఫొటోలు దిగించి బయో ట్యాగింగ్‌ చేసే కార్యక్రమం జరుగుతోంది. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.70 లక్షలుఖర్చు చేస్తున్నాం. 50793 ఇళ్లకు సంబంధించి 1370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అవసరమైన నీటి సరఫరా కోసం 32 కోట్లుతో టెండర్లు ఖరారయ్యాయి. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 326 కోట్లు, అప్రోచ్‌ రోడ్లు కోసం 8 కోట్లుతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. సీఆర్డీఏ పరిధిలో నిర్మించే లేఅవుట్లలో అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్‌, పార్కులు వస్తాయి.

రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి..

రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.70 లక్షలతో కట్టడం మొదలుపెట్టాం. 22 లక్షల ఇళ్లకు సంబంధించిన కట్టడాలు వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఇవి పూర్తయితే ఆ ఇంటి స్థలం విలువ, ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి విలువ 5 లక్షల నుంచి 15 లక్షలు పలుకుతుంది. సీఆర్డీఏ ప్రాంతంలో ఇక్కడి విలువ గజం కనీసం 15 వేలు. నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలం విలువే రూ.7.50 లక్షలు. మరో 2.70 లక్షలు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కోసం అదనంగా ప్రతి ఇంటి మీద మరో లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. పూర్తయ్యే సరికి ఇక్కడ ఇంటి విలువ అక్కచెల్లెమ్మల చేతిలో 12 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతుంది.

ఇక్కడే 24 కౌంటర్లు ఏర్పాటు చేశాం. మిమ్మల్నందరినీ మీమీ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు మ్యాప్ చేశాం. ఇదే కౌంటర్లలో ఇక్కడి నుంచి మీ ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. మీకు భోజనాలు కూడా ప్యాకెట్లను అరేంజ్‌ చేయడం జరిగింది. మీ అందరి చేతుల్లోఇళ్ల మంజూరు పత్రాలు పెట్టి చిక్కటి చిరునవ్వులతో ఇంటికి పంపిస్తాం. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికిదేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఇలాంటి మంచి చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరిగించే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.” అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Read Also : CM Jagan at Nethanna Nestham: వాలంటీర్ల గురించి వీళ్లా మాట్లాడేది..? పవన్‌ నుంచి లోకేష్‌, బాలయ్య వరకు దుమ్ము దులిపేసిన జగన్‌

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles