Purandeswari on amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ఎన్నో నిధులు ఇచ్చామన్నారు.ఇవాళ బీజేపీ నేతలతో కలిసి గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇకపై కూడా అమరావతికి నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. పేదలకు కట్టించిన ఇళ్లపై రాష్ట్ర సర్కారు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. (Purandeswari on amaravati)
పెన్నా నదిలో ఇసుక తవ్వకాల్లో అవినీతి జరిగిందని, మంత్రి కాకాణి గ్రావెల్ తవ్వుకుంటున్నారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు ఎక్కడ ఉందో అక్కడే ఉందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు మరమత్తుకు రూ. 3 కోట్లు కూడా కేటాయించడం లేదని ఆవేదన చెందారు పురందేశ్వరి. గ్రానైట్ యాజమాన్యాలను సర్కారు ఇబ్బందిపెడుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందడం లేదని చెప్పారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు మాత్రం అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు.
పేరు మార్పు అన్నది ఎన్టీఆర్‌ను అవమానించడమే…
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వల్ల ఎవరిక లాభం కలిగిందో తెలియదన్నారు. పేరు మార్పు అన్నది ఎన్టీఆర్‌ను అవమానించడమేనన్నారు. కరెంటు ఛార్జీలు ఏడుసార్లు పెంచారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్స్ పేరుతో స్కామ్ జరుగుతోందన్నారు. పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరమని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.
విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రూ. 1470 కోట్లతో వంతెన పూర్తవుతోందన్నారు. అమరావతిని రాజధానిగా గుర్తించి గుంటూరు, తెనాలికి గ్రీన్ ఎలైన్‌మెంట్ సాకారం చేయాలన్నారు. గిద్దలూరు నుంచి వినుకొండ వరకు దహదారి విస్తరణ పనులు కేంద్రం చేపట్టిందన్నారు. నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు నాలుగు వరసల రహదారి మంజూరు చేసిందన్నారు. ఏపీకి… కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని స్పష్టం చేశారు.
అమరావతిలో టూరిజానికి రూ. 70 కోట్లు కేటాయించారని, తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు పెరిగాయన్నారు. ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదన్నారు. విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే పట్టించుకున్న నాథుడే లేరని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : MP GVL VS Purandeswari: ఆ ఎంపీ సీటుపై జీవీఎల్ వర్సెస్ చిన్నమ్మ..! విమర్శలు అందుకేనా?