CM Chandrababu: జే-బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండులు పెట్టి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల ప్రాణాలు తీశాడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వీరి చేతిలో పెట్టుకుని, కోట్లు వెనకేశారంటూ విమర్శలు గుప్పించారు. అందుకే కొత్త మద్యం పాలసీని తెస్తున్నామన్న ఆయన.. బీసీలకు 10% మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు.
నాసిరకం బ్రాండ్లు కాకుండా, ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి, క్వార్టర్ రూ.99 కే ఇస్తామన్నారు. అలాగే తాగొద్దు అని కూడా చెప్తున్నానన్నారు. రూ.100 కోట్ల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాల పై అవగాహనా కార్యక్రమాలు చేస్తామన్నారు. కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, పుచ్చకాయలమాడలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి సీఎం పింఛన్లు అందజేశారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో సరదాగా ముచ్చటించారు. బాధితులు, దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గత పాలకులు పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని చంద్రబాబు ఆరోపించారు. మళ్లీ పోలవరం పనులు గాడిలో పెడుతున్నామన్నారు. పోలవరం పూర్తి చేసి, ఆ నీళ్లు పెన్నాకి అనుసంధానం చేసి, రాయలసీమ కరువుని అధిగమిస్తామన్నారు.
’’వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులు ఇచ్చాం. డిసెంబర్‌లో డీఎస్సీ పరీక్ష అవ్వగానే, ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తాయి. నిన్నే లూలు లాంటి సంస్థ మళ్ళీ వచ్చింది. అటు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తూనే, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నాం.
గత జగన్ రెడ్డి పాలనలో విధ్వంసం జరిగింది. ఆ శిథిలాలు తొలగించి, మళ్లీ ఇటుక ఇటుకా పేర్చుకుంటూ పునర్నిర్మాణం చేస్తున్నాం. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లాడు. రూ.లక్ష కోట్లు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి.. దీనికి తోడు దోపిడీ చేశారు. నాటి పాలకుల పాపాలు నేడు శాపాలుగా మారాయి. అయినా సరే కష్టపడతా.. ఇవన్నీ తాత్కాలికం, రాష్ట్రం గాడిలో పడే వరకు కష్టపడి, మీకు అండగా ఉంటా.
గత పాలకుడి పాలన చూసి విరక్తి చెంది, మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్ తీర్పు ఇస్తూ, కూటమికి 93% సీట్లు గెలిపించారు. ప్రజలు ఎంత కసిగా ఓటు వేశారో ఈ ఫలితాలు చూస్తూనే తెలుస్తుంది. కనీసం ప్రజలకు స్వేఛ్చ కూడా లేకుండా, దుర్మార్గం గత పాలకులు పాలించారు. ఎస్కోబార్ కంటే డేంజర్ ఈ జగన్. ప్రజలు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.
సామాజిక పెన్షన్లు మొదటి తారీఖు ఇవ్వటమే కాదు, ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా మొదటి తీరీఖునే ఇస్తున్నాం. చరిత్రలో ఎవరూ చేయని విధంగా, దేశంలోనే అత్యంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రూ.4 వేలు పెన్షన్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read also: CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలి: చంద్రబాబు
Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
Chandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..
Chandrababu: దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ: ఎన్డీఏ భేటీలో చంద్రబాబు
