KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. “నా మెడ దగ్గర పులివెందుల కత్తి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు కాకుండా, తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జైలులో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని హాస్యభరితంగా వివరిస్తూ చెప్పిన సందర్భానికి చెందినవని తెలుస్తోంది. ఈ వీడియో మళ్లీ వైరల్ కావడంతో ఆ సంఘటనపై చర్చ మొదలైంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంఘటన
కేటీఆర్ వివరాల ప్రకారం, 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో అధికారులు తనను బాగా చూసుకున్నారని, మరుసటి రోజు షేవింగ్ చేయించుకోవాలా అని అడిగారని చెప్పారు. అందుకు అంగీకరించడంతో ఖైదీల్లో బార్బర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.
‘ఏ ఊరు తమ్ముడూ?’.. ‘పులివెందుల సార్’ అన్న బార్బర్
షేవింగ్ చేస్తున్న సమయంలో మాటలు కలపాలని భావించి కేటీఆర్, “ఏ ఊరు తమ్ముడూ?” అని అడిగారట. ఆ సమయంలో బార్బర్ కత్తి తన మెడపై ఉండగా, అతను “పులివెందుల సార్” అని సమాధానం చెప్పాడని కేటీఆర్ నవ్వుతూ వివరించారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాజకీయంగా సున్నితమైన పరిస్థితులు ఉండటంతో, ఆ క్షణంలో తనకు ఒకింత టెన్షన్ కలిగిందని చెప్పారు. అయితే వెంటనే ఆ బార్బర్ చిరునవ్వుతో తాము తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకుంటామని చెప్పి, శుభాకాంక్షలు తెలిపాడని కేటీఆర్ వెల్లడించారు.
హాస్యభరితంగా చెప్పిన సంఘటన.. ఇప్పుడు వైరల్
ఈ అనుభవాన్ని కేటీఆర్ ఒక సభలో సరదాగా వివరిస్తూ, “నా పీక మీద పులివెందుల కత్తి ఉంది” అని వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఉత్కంఠను హాస్యరూపంలో చెప్పడమేనని వీడియో పూర్తి సందర్భం చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఆ వీడియోలోని చిన్న క్లిప్ మాత్రమే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ఈ వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్
ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కేటీఆర్ చెప్పిన అనుభవాన్ని సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు పూర్తి వీడియోను చూడకుండా క్లిప్‌ల ఆధారంగా స్పందించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, తెలంగాణ ఉద్యమ రోజుల్లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
ఇవీ చదవండి: KTR : ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు
KTR : సానుభూతి ఆధారంగా ఓటు వేయవద్దు – కేటీఆర్ పాత వీడియో వైరల్
KTR vs CM Ramesh : కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్.. అసలేం జరిగింది?
