Idiot Syndrome: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగంలో ఉన్నాం. ఏ అవసరం వచ్చినా వెంటనే ఇంటర్నెట్ లోకి వెళ్లిపోయి వెతకడం పరిపాటిగా మారిపోయింది. సమస్యకు పరిష్కారం దొరికేస్తోంది. కానీ, వైద్యం విషయంలోనూ కొందరు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని అధ్యనాలు చెబుతున్నాయి. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆన్ లైన్ లోకి వెళ్లి వెతుకుతున్నారు.
అనవసరంగా పదే పదే ఆన్‌లైన్‌లో శోధించడాన్నే ఇడియట్ సిండ్రోమ్ అని పిలుస్తారని మీకు తెలుసా? ‘ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ సిండ్రోమ్‌నే వైద్య పరిభాషలో సైబర్‌కాండ్రియా అని పిలుస్తారు. చాలామంది ఈ మధ్య తమకున్న లక్షణాలను బట్టి ఆన్‌లైన్‌లో వెతికేసి జబ్బు ఏంటో కన్ఫం చేసేసుకుంటున్నారు. వైద్యుడి వద్దకు వెళ్లకుండానే చికిత్స చేసుకుంటున్నారట.
ఇంటర్నెట్‌లో పలు రకాల వ్యాధులు, హెల్త్ ప్రాబ్లమ్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ విరివిగా దొరుకుతోంది. అయితే, వీటిలో తప్పుడు సమాచారం కూడా లేకపోలేదు. కొన్నిసార్లు పూర్తి వివరాలు తెలుసుకోకుండానే మిడిమిడి జ్ఞానంతో కొందరు వీడియోలు, ఆర్టికల్స్ ను పబ్లిక్ డొమైన్ లో ఉంచేస్తారు. ఇడియట్ సిండ్రోమ్‌తో బాధపడేవారు ఇలాంటి వాటి ఆధారంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వారికి లేని సమస్యను కూడా తెచ్చుకుని చికిత్స తీసుకునే ప్రమాదం ఉంది. లేదా నిజంగా ఆందోళన చెందాల్సిన వ్యాధి ఉన్నా ఐడెంటిఫై చేయలేకపోతారు.
ఇడియట్ సిండ్రోమ్ అంటే..
ఇడియట్ సిండ్రోమ్‌తో బాధ పడేవారు తీవ్ర ఆందోళనలో గడుపుతారు. చిన్నపాటి లక్షణాలకే తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు ఫీలైపోతారు. వైద్య సమాచారం కోసం గంటలతరబడి ఇంటర్నెట్ లో వెతికేస్తుంటారు. ఆన్‌లైన్‌లో లభించిన ఇన్ఫర్మేషన్ ను బట్టి దిగులు చెందుతుంటారు. ఆన్‌లైన్‌లో వెతికినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు సంబంధించి నిర్ణయాలు ఏవేవో తీసుకుంటూ ఉంటారు. వైద్యులు ఇచ్చే సమాచారాన్ని కూడా నమ్మని స్థితికి చేరుకుంటూ ఉంటారు.
ప్రభావం ఎంత మేరకు ఉంటుందంటే..
పూర్తిగా ఇంటర్నెట్ సెర్చ్‌పై ఆధారపడితే జబ్బును నిర్ధారించడంలో ఫెయిల్ అయినట్టే. ఫలితంగా ఒక వ్యాధికి మరో చికిత్స తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఉన్న వ్యాధి మరింత ముదిరి ప్రాణానికే ముప్పు కలగొచ్చు. పదే పదే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తూ తీవ్ర ఆందోళనకు గురై మానసికంగానూ కుంగిపోతారు. ఆన్‌లైన్‌లో సాధారణంగా అందరిలో కనిపించే లక్షణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అవి ఉన్నంత మాత్రాన కచ్చితంగా అదే జబ్బు తమకూ ఉందని అనుకోవాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు.
బయటపడటం ఎలా?
చిన్న చిన్న లక్షణాలు ఉంటే కూడా కొందరు వారికి వారే ఏదో పెద్ద రోగం వచ్చిందని కుంగిపోతుంటారు. ఇది మరింత ఆందోళన, మానసిక జబ్బులకు దారితీస్తుంది. వైద్యులు ధ్రువీకరించకుండా ఎవరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమని తాము తక్కువ చేసుకోరాదు. ఆందోళన నుంచి బయటకు రావడానికి కొన్ని రిలాక్సేషన్ పద్ధతులను అనుసరించాలి. దీర్ఘశ్వాస, ధ్యానం, కండరాలను వదులు చేసే వ్యాయామాలు లాంటివి చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
అదంతా నిజం కాదు
అంతర్జాలంలో ఉన్న సమాచారం అంతా నిజం కాదని గుర్తించాలి. పైగా ఒక అనారోగ్య సమస్యను మీకు మీరే ఏవేవో అన్వయించుకుని నిర్ధారణకు రావొద్దు. ఆ దిశగా వచ్చే అన్ని ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టాలి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆందోళన నుంచి బయటకు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదా మానసిక నిపుణులను కాంటాక్ట్ కావాలి. టెక్నాలజీ మెరుగవుతున్నకొద్దీ ఇడియట్ సిండ్రోమ్ మరింత విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలపై అవగాహన ఉండడం మంచిదే కానీ ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా నిర్ణయాలకు రావడం ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. అందుకే నిజంగానే మీకు ఆరోగ్య సమస్య ఉందా? లేక ఇంటర్నెట్‌లో సమాచారం ఆధారంగా ఆందోళన చెందుతున్నారా? అన్నది తొలుత గుర్తించాలి. వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకున్నాకే తగిన చికిత్స పొందాలి.
ఇవీ చదవండి: Apple: రోజుకో యాపిల్ తినడం వల్ల వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పని లేదు.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం
Vitamin D Deficiency: విటమిన్-డి కోసం రోజూ ఎంతసేపు ఎండలో ఉండాలి? వైద్యులు ఏం చెబుతున్నారు?
Family Doctor: ఫ్యామిలీ డాక్టర్.. మీ ఇంటి వద్దకే వచ్చి వైద్యం చేస్తాం!
SADAREM: సదరం సర్టిఫికెట్ ఎలా పొందాలి? ఎక్కడ ఇస్తారు? పూర్తి వివరాలు ఇవీ..
