సోమవారం, 2 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
International, Telangana

Saritha Komatireddy: ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ బరిలో తెలంగాణ మహిళ.. ఎవరీ సరిత కొమటిరెడ్డి?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 2 నవంబర్ 2026

Saritha Komatireddy: అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ మూలాలున్న సరిత కొమటిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అటార్నీ జనరల్, డెమోక్రటిక్ పార్టీ నేత లెటిషియా జేమ్స్‌తో సరిత తలపడుతున్నారు. 42 ఏళ్ల సరితకు ఇది తొలి ప్రత్యక్ష ఎన్నిక. గతంలో ఉగ్రవాదులు, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలపై న్యాయపోరాటం చేసిన అనుభవంతో ఆమె ఎన్నికల బరిలో దిగారు. నేరాలు, అవినీతి, ఆర్థిక మోసాల నియంత్రణను ప్రధాన ప్రచార అంశాలుగా మార్చుకున్నారు.

ట్రంప్, బైడెన్ ఇద్దరి హయాంలోనూ గుర్తింపు

సరిత కొమటిరెడ్డి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించారు. హార్వర్డ్ కాలేజ్, హార్వర్డ్ లా స్కూల్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 2013 నుంచి 2025 వరకు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదులతో పాటు మెక్సికోకు చెందిన సినాలోవా డ్రగ్ కార్టెల్‌కు సంబంధించిన కేసులను వాదించారు. సైబర్ నేరాలు, మనీలాండరింగ్, అంతర్జాతీయ అవినీతిపై దర్యాప్తుల్లో కీలక పాత్ర పోషించారు. 2020లో ట్రంప్ ఆమెను ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. అయితే ఆ నియామకం పూర్తికాలేదు. ఆసక్తికరంగా జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023–24 మధ్య అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కొలంబియా లా స్కూల్‌లో న్యాయశాస్త్రం బోధిస్తున్నారు.

కరీంనగర్ గ్రామంతో అనుబంధం

సరిత తల్లిదండ్రులు హనుమాన్ రెడ్డి, గీత కొమటిరెడ్డి. వైద్యులైన వీరిద్దరూ 1980వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. ఆమె తల్లి హైదరాబాద్‌లో పెరగగా, తండ్రి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని చేగొన్న గ్రామం. అమెరికాలో స్థిరపడినప్పటికీ కుటుంబం తెలంగాణతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. తన నలుగురు పిల్లలకు భారతీయ సంస్కృతి, కుటుంబ మూలాలను పరిచయం చేయడానికి స్వగ్రామానికి వస్తుంటామని సరిత వెల్లడించారు. న్యూయార్క్ రాష్ట్రవ్యాప్త ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా ఆమె తనను తాను అభివర్ణించుకున్నారు.

నేరాల నియంత్రణే ప్రధాన అజెండా

న్యూయార్క్‌లో ప్రజల భద్రత విషయంలో ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ విఫలమయ్యారని సరిత ఆరోపిస్తున్నారు. అటార్నీ జనరల్ కార్యాలయంలో నేర విచారణలకు ప్రాధాన్యం పెంచడంతో పాటు స్థానిక ప్రాసిక్యూటర్లకు మరింత సహకారం అందించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం సుమారు 700 మంది న్యాయవాదులున్న కార్యాలయంలో క్రిమినల్ కేసులపై పనిచేసే వారి సంఖ్యను 350కి పెంచాలన్నది ఆమె లక్ష్యం. అయితే ఈ పదవికి పౌరహక్కులు, వినియోగదారుల రక్షణ, ప్రభుత్వంపై న్యాయపరమైన పర్యవేక్షణ వంటి బాధ్యతలు కూడా ఉన్నాయని ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. లెటిషియా జేమ్స్ సైతం తన హయాంలో ప్రజల హక్కుల రక్షణకు చేపట్టిన న్యాయపోరాటాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

సర్వేల్లో వెనుకంజ.. గెలుపు సాధ్యమేనా?

అక్టోబర్ 31న ట్రంప్ మరోసారి సరితకు పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే న్యూయార్క్‌లో రిపబ్లికన్లకు అనుకూల పరిస్థితులు లేవు. 1994 తర్వాత ఆ పార్టీ అభ్యర్థి అటార్నీ జనరల్ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అక్టోబర్ 28న విడుదలైన సియెనా సర్వేలో లెటిషియా జేమ్స్‌కు 54 శాతం, సరితకు 39 శాతం మద్దతు లభించింది. దీంతో 15 శాతం పాయింట్ల వెనుకంజను అధిగమించడం సరితకు పెద్ద సవాల్‌గా మారింది. ఒకవైపు ట్రంప్ మద్దతు, మరోవైపు సుదీర్ఘ న్యాయవాద అనుభవం ఆమెకు బలంగా నిలుస్తున్నాయి. తెలంగాణ మూలాలున్న ఈ న్యాయవాది అమెరికాలో కీలక పదవిని దక్కించుకుంటారా అన్నది నవంబర్ 3 ఎన్నికల ఫలితాలతో తేలనుంది.

ఇవీ చదవండి: Trump vs Zelensky: ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. జెలెన్‌స్కీని మార్చేయాలా? ఉక్రెయిన్‌ యుద్ధంలో కొత్త ట్విస్ట్!
Trump Iran War: మాట వినకపోతే నరకానికే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.