Telangana DA Hike 2026: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల్లో రెండు డీఏలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల డీఏ ఏకంగా 33.67 శాతం నుంచి 40.04 శాతానికి చేరనుంది. అంటే రెండు విడతలు కలిపి డీఏలో 6.37 శాతం పాయింట్ల పెరుగుదల వస్తుంది. పెరిగిన డీఏను అక్టోబర్ నెల వేతనంతో కలిపి చెల్లించనుండటంతో నవంబర్ 1న ఉద్యోగులకు అందే జీతంలో పెరుగుదల కనిపించనుంది. మరోవైపు 2024 నుంచి పేరుకుపోయిన డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నారు.
రెండు విడతల్లో డీఏ ఎంత పెరిగిందంటే?
2020 పే స్కేల్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు 2024 జనవరి 1 నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచారు. అంటే మొదటి విడతలో 3.64 శాతం పాయింట్ల పెరుగుదల లభించింది. 2024 జూలై 1 నుంచి మరో 2.73 శాతం పాయింట్లు పెంచడంతో డీఏ 37.31 శాతం నుంచి 40.04 శాతానికి చేరింది. ఈ రెండు విడతలను కలిపితే ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న డీఏతో పోలిస్తే మొత్తం 6.37 శాతం పాయింట్ల మేర పెరుగుదల వస్తుంది.
రూ.లక్ష బేసిక్ ఉంటే ఎంత పెరుగుతుంది?
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.1 లక్ష ఉంటే రెండు డీఏల కారణంగా నెలకు సుమారు రూ.6,370 అదనంగా లభిస్తుంది. అయితే ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా డీఏ మొత్తం మారుతుంది. అంటే రూ.50 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగికి రెండు డీఏల ప్రభావం సుమారు రూ.3,185 వరకు ఉండొచ్చు. రూ.60 వేల బేసిక్ పే ఉంటే సుమారు రూ.3,822, రూ.80 వేల బేసిక్ ఉంటే సుమారు రూ.5,096 మేర స్థూల డీఏ పెరుగుదల ఉంటుంది.
2015 పే స్కేల్ ఉద్యోగులకూ పెంపు
2015 పే స్కేల్ పరిధిలోని ఉద్యోగులకు కూడా ప్రభుత్వం డీఏ పెంచింది. 2024 జనవరి నుంచి డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి, జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వివిధ పే స్కేల్స్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు వారి పే స్కేల్‌కు అనుగుణంగా పెరిగిన డీఏ ప్రయోజనం లభించనుంది.
UGC, AICTE ఉద్యోగులకు కూడా..
యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్స్ పరిధిలోని ఉద్యోగులకు కూడా డీఏ పెంపు వర్తించనుంది. 2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను మొదట 46 శాతం నుంచి 50 శాతానికి, ఆ తర్వాత 2024 జూలై నుంచి 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. 2006 పే స్కేల్ పరిధిలోని ఉద్యోగులకు డీఏ మొదట 230 శాతం నుంచి 239 శాతానికి, అనంతరం జూలై 2024 నుంచి 239 శాతం నుంచి 246 శాతానికి పెరగనుంది.
6.91 లక్షల మందికి ప్రయోజనం
ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, ఇతర అర్హత కలిగిన సిబ్బందిని కలిపి సుమారు 6,91,940 మందికి ప్రయోజనం చేకూరనుంది. వీరిలో జీపీఎఫ్ పరిధిలో 1,34,671 మంది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో 2,21,464 మంది, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల్లో 34,221 మంది ఉన్నారు. అదేవిధంగా సుమారు 2,94,945 మంది పెన్షనర్లు కూడా ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు.
బకాయిలే రూ.6,174 కోట్లు!
రెండు డీఏలకు సంబంధించిన బకాయిల మొత్తం విలువ భారీగానే ఉంది. 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు మొదటి డీఏకు సంబంధించి 33 నెలల బకాయిలు సుమారు రూ.3,810 కోట్లు ఉంటాయని అంచనా. 2024 జూలై నుంచి 2026 సెప్టెంబర్ వరకు రెండో డీఏకు సంబంధించి 27 నెలల బకాయిలు రూ.2,364 కోట్ల వరకు ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. రెండింటినీ కలిపితే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల మొత్తం సుమారు రూ.6,174 కోట్లకు చేరుతుంది.
ప్రభుత్వంపై ఏటా రూ.2,500 కోట్ల భారం
రెండు డీఏల అమలు కారణంగా ప్రభుత్వంపై ప్రతి నెలా దాదాపు రూ.208 కోట్ల అదనపు వ్యయం పడుతుందని అంచనా. ఏడాది మొత్తానికి చూస్తే రాష్ట్ర ఖజానాపై సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడనుంది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు రెండు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబర్ 1న పెరిగిన జీతం
ఉద్యోగులకు మరో ముఖ్యమైన విషయం ఇదే. పెరిగిన డీఏను అక్టోబర్ 2026 వేతనంలో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగుల నెలవారీ జీతంలో రెండు డీఏల ప్రభావం ఒకేసారి కనిపించనుంది. అయితే గత నెలలకు సంబంధించిన భారీ బకాయిల మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో చెల్లించకుండా నిర్ణయించిన విధానం ప్రకారం విడతల వారీగా సర్దుబాటు చేయనున్నారు.
ఉద్యోగులకు ఇంకా డీఏలు పెండింగ్‌లోనే..
రెండు డీఏల విడుదల ఉద్యోగులకు ఊరటనిచ్చినప్పటికీ డీఏ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. 2025 జనవరి, 2025 జూలై, 2026 జనవరి నుంచి రావాల్సిన తదుపరి డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2025 జనవరి డీఏ 1.82 శాతం పాయింట్లు, జూలై 2025 డీఏ 2.73 శాతం పాయింట్లు, జనవరి 2026 డీఏ మరో 1.82 శాతం పాయింట్లు ఉంటుంది. ఇవన్నీ కలిపితే డీఏ 46.41 శాతం వరకు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 2024 జనవరి, జూలైకి సంబంధించిన రెండు డీఏలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. మిగిలిన డీఏలను కూడా త్వరగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ఉద్యోగులకు భారీ ఊరట
చాలా కాలంగా డీఏలు, బకాయిల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయం ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది. రెండు డీఏలు ఒకేసారి అమల్లోకి రావడంతో నెలవారీ వేతనంలో స్పష్టమైన పెరుగుదల కనిపించనుంది. అదే సమయంలో పెండింగ్ బకాయిల మొత్తం రూ.6 వేల కోట్లకు పైగా ఉండటం, ఇంకా మరికొన్ని డీఏలు పెండింగ్‌లో ఉండటంతో తదుపరి విడతల విడుదల ఎప్పుడు జరుగుతుందన్న అంశంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
Read also: Telangana Free Bus: తెలంగాణలో పురుషులకు కూడా ఫ్రీ బస్సు?.. సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం
Telangana Tula Gold Scheme: దసరాకు తులం బంగారం పథకం.. కల్యాణలక్ష్మి స్థానంలో కొత్త విధానం, పేదింటి ఆడబిడ్డలకు భారీ ప్రయోజనం






