Karnataka: “అన్న భాగ్య”కు కేంద్రం సహాయనిరాకరణ? బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వనున్న సిద్దూ సర్కార్‌!

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం పథకాల అమలుకు సిద్దరామయ్య ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అన్న భాగ్య (Anna Bhagya) స్కీమ్ అమలుకు ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రం వైఖరే ఇందుకు కారణం అవుతోంది. (Karnataka)

అన్న భాగ్య పథకం అమలు జూలై 1 నుంచి జరగాల్సి ఉంది. అయితే, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం సేకరణ కష్టతరంగా మారింది. బీపీఎల్ కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం చొప్పున ఉచితంగా అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) హామీ ఇచ్చింది. ఇప్పుడు అమలు చేయాలంటే కేంద్రం బియ్యం సరఫరా చేయాల్సిన పరిస్థితి అవశ్యం అయ్యింది. అయితే, బియ్యం తాము సరఫరా చేస్తామని చెప్పామా? అంటూ కేంద్రం (BJP Govt) ప్రశ్నిస్తోంది. దీంతో సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రభుత్వానికి ఈ పథకం అమలులో కష్టాలు ఎదురవుతున్నాయి.

అన్న భాగ్య పథకం అమలుకు బియ్యం సేకరణ సాధ్యం కాకపోవడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఉచిత బియ్యానికి బదులుగా కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనుంది సిద్ధూ ప్రభుత్వం.

తాజాగా బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ.34 ఉందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప పేర్కొన్నారు. బీపీఎల్ కార్డుదారులందరికీ బియ్యం సరఫరా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశామని, అవి సాధ్యం కాలేదన్నారు. దీంతో నగదు జమ చేసేందుకు నిర్ణయించామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్న భాగ్య పథకం అమలు చేయాలని చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం బియ్యం సరఫరాకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, బియ్యం ఇస్తామని తామేమీ హామీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమవుతోందని రాష్ట్ర బీజేపీ ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలా కేంద్ర, రాష్ట్రాల మధ్య వాదనలు నడుస్తున్నాయి.

బియ్యం అందుబాటులోకి వచ్చే వరకు నగదు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక రేషన్ కార్డులు (Rice Cards) ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170, ఇద్దరు ఉంటే రూ.340, ఐదుగురు సభ్యులుంటే నెలకు రూ.850 చొప్పున ఖాతాల్లో జమ చేయనుంది కర్ణాటక ప్రభుత్వం. అన్న భాగ్య పథకం కింద ఇచ్చే 5 కిలోల బియ్యం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోలకు అదనం. ఇందుకు అవసరమైన బియ్యం సేకరణ విషయంలో కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య పొసగడం లేదు. దీంతో నగదు జమ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) నిర్ణయం తీసుకుంది.

Read Also : Karnataka Temple: ఆ దేవాలయం ఏడాదిలో మూడు రోజులే తెరుచుకుంటుంది..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles