Heatwave countries: ఐరోపా దేశాల్లో ఉష్ణతాపం ప్రతాపం చూపిస్తోంది. భూగోళం వేడెక్కుతోందన్న సైంటిస్టుల అంచనాలను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో హీట్ వేవ్ దంచి కొడుతోంది. ఎండ వేడిమితో పలు దేశాలు విలవిలాడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఏకంగా 54 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రత చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది. యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ అంచనాల ప్రకారం.. యూఎస్, జపాన్, ఐరోపాలోని దేశాలు ఉష్ణతాపంతో అతలాకుతం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయా దేశాల్లో ప్రజలు ఉక్కపోత, వేడిమి దాటికి తట్టుకోలేకపోతున్నారు. (Heatwave countries)
మైక్రో ఓవెన్‌లో వేసి ఉడికించినట్లుగా పరిస్థితి మారిపోయిందని ప్రజలు అంటున్నారు. మరోవైపు ఈనెలలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ విధంగా వేడి పెరిగిపోవడానికి కారణాలు ఒక్కటి అని చెప్పలేమంటున్నారు సైంటిస్టులు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్, సహజ శిలాజ ఇంధనాలన్నీ కలిసి వేడిని మరింత పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికా, ఐరోపా కంట్రీస్, జపాన్‌లో తాజాగా రికార్డు స్థాయి వేడి నమోదైంది. కోట్లాది మంది జనం అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. యూఎస్‌లోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు పవర్‌ఫుల్‌గా వేడి గాలులు వీస్తున్నాయని యూఎస్ జాతీయ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ వారం తీవ్రమైనదని, ప్రమాదకరమైందిగా తెలిపింది. సాధారణంకంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది.
ఎక్కువ ఎండలతో ఆరిజోనా స్టేట్ తీవ్ర ప్రభావానికి గురవుతోంది. పగటి సమయం అధికంగా ఉంటోంది. రాజధాని ఫీనిక్స్‌లో వరుసగా 16 రోజులపాటు 109 డిగ్రీల ఫారన్‌హీట్ (43 డిగ్రీలు) కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా 115 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరుకోనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు ఎండలతో సతమతం అవుతున్నారు. పనులు ముందుకు సాగడం లేదు. ఉత్తర కెనడాలో ఈ ఏడాది కోటి హెక్టార్లలో అడవులు దగ్ధమయ్యాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇటలీలో హిస్టరీలోనే అధిక ఉష్ణోగ్రతలు వెలుగు చూస్తున్నాయి. రోమ్‌సహా 16 నగరాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. 2007 ఆగస్టులో నమోదైన 40.5 డిగ్రీల రికార్డును ఈ సారి ఉష్ణోగ్రతలు తిరగరాసే చాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు ఐరోపాలోని సిసిలీ, శార్దీనియాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐరోపా అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఇదే ఐరోపాలోని అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతని తెలిపింది.
స్పెయిన్‌లో సోమవారం నుంచి బుధవారం వరకూ 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్థానిక వాతావరణశాఖ వెల్లడించింది. జపాన్‌లోనూ 39 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ సంస్థ తెలిపింది. గత రికార్డులను ఇవి తిరగరాస్తున్నాయని వెల్లడించింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గ్రీస్‌లోని ఎథెన్స్‌లో ఉన్న యాక్రోపొలిస్‌ను ఎండల కారణంగా మూసివేశారు. ఫ్రాన్స్‌లో విపరీతమైన ఎండల కారణంగా కరవు తలెత్తే అవకాశముందని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. గత నెల జూన్ ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతల మాసంగా నిలిచింది. ఎండల కారణంగా జోర్దాన్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అయినప్పటికీ 214 టన్నుల నీటిని అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పడానికి వినియోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇరాక్‌లోని టైగ్రిస్ నది పొడిబారిపోయింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటుతున్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటిగా పేరు గాంచింది. ఆదివారం అక్కడ 129 డిగ్రీల ఫారన్‌హీట్ (54 డిగ్రీల సెల్సియస్) నమోదు కావడం విశేషం.
Read Also : Climate Crisis: వంద కోట్ల మంది సామూహిక వలసలు..!