గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Agriculture, Andhra Pradesh

Andhra Pradesh : సాగునీటి సంఘాలకు జీఎస్టీ మినహాయింపు – ప్రతి ఎకరాకు నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026

Andhra Pradesh : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. గురువారం అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన నీరు–ప్రగతి, జల హారతి – సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధి, సమర్థ వినియోగం ద్వారానే వ్యవసాయ భవిష్యత్‌ బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని చెప్పారు.

రాయలసీమ నుంచి రతనాల సీమకు
రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఒకప్పుడు భయాలు వ్యక్తమయ్యాయని, అయితే ఎన్టీఆర్‌ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ ప్రాంతానికి జీవం పోశాయని చంద్రబాబు గుర్తుచేశారు. హంద్రీనీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ చొరవతోనే ముందుకు వచ్చాయని తెలిపారు.

నీరు–చెట్టు కార్యక్రమం, ఇంకుడు గుంతల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ వంటి చర్యలతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. దేశంలో తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం జిల్లా నేడు పండ్ల తోటల వనంగా మారిందంటే అది ప్రభుత్వ దూరదృష్టి ఫలితమన్నారు.

సాగునీటి సంఘాల పాత్ర కీలకం
1997లో దేశంలోనే తొలిసారిగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు నిర్మించామని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి సంఘాలకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బిల్లులన్నీ క్లియర్ చేశామని తెలిపారు.

2024 డిసెంబరులో 6,047 నీటి వినియోగదారుల సంఘాలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.344 కోట్లతో 7,197 ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ పనులు రైతు సంఘాల ద్వారా చేపట్టామని వెల్లడించారు. నామినేషన్ పద్ధతిలో అప్పగించే పనుల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు.

ప్రతి ఎకరాకు నీరివ్వడమే నిజమైన జల హారతి
నదుల అనుసంధానం పూర్తయి ప్రతి ఎకరాకు నీరు అందితే అదే నిజమైన జల హారతిగా సీఎం అభివర్ణించారు. 2014–19 మధ్య సాగునీటిపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రానికి ఏటా 1300 టీఎంసీల నీరు అవసరమని వివరించారు.

పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌కు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం పూర్తయ్యాక నదుల అనుసంధానం చేపడతామని, పట్టిసీమ ద్వారా ఇప్పటికే కృష్ణా డెల్టాకు నీరిచ్చామని గుర్తు చేశారు.

రాయలసీమ ఎత్తిపోతలపై మభ్యపెట్టే ప్రయత్నాలు
రాయలసీమ ఎత్తిపోతల అంశంతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం విమర్శించారు. అనుమతులు లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టును ఎన్జీటీ నిలిపేసిందని, ఇప్పుడు మళ్లీ గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 23 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ప్రధాని Narendra Modi నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని, మిత్రుడు Pawan Kalyanతో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: YSRCP Meeting : విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా రాష్ట్రం తిరోగమనం: జగన్
Collectors Conference : మార్చి 2026 నాటికి సోలార్ 2.93 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లు

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading