Tirumala News 23-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,650 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. (Tirumala News 23-09-2023)
తిరుమలలో కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై స్వామివారు విహరించారు. ఇవాళ తిరుమలలో శ్రీవారికి హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి 10 వరకు హనుమంత వాహన సేవ జరిగింది. సాయంత్రం 4 నుంచి 5 వరకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీవారి గజవాహన సేవ ఉంటాయని టీటీడీ తెలిపింది. నేడు ఆరో రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
టీటీడీ విస్తృత ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.
గరుడ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అందిస్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా.
మరోవైపు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఆరో రోజు కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి బ్రహ్మోత్సవాల్లో స్వామి వైభవాన్ని తిలకించి పుణీతులవుతున్నారు.
ఇదీ చదవండి: Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవీ..