MP GVL VS Purandeswari: బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆ స్థానంలో నూతన అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించిన సంగతి తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఏపీ బీజేపీలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల సంగతి ప్రస్తుతానికి క్లారిటీ రాకపోయినా.. సీట్ల కేటాయింపులు ఎలా ఉన్నా.. ఓ ఎంపీ స్థానంలో పోటీ చేసే విషయమై ఏపీ బీజేపీలో అంతర్గతంగా పోటీ నెలకొందట. అది ఏ నియోజకవర్గం? ఎందుకు పోటీ ఏర్పడింది? గెలవగలిగే సత్తా ఎవరికి ఉంది? బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆ స్థానం ఎవరికి వెళ్తుంది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. (MP GVL VS Purandeswari)
ఏపీలోని విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై ఇప్పుడు బీజేపీలో పోటీ ఏర్పడిందట. రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నేతలుగా ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే పార్లమెంటు నుంచి గతంలో ఎంపీగా గెలుపొందిన, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం అయిన దగ్గుబాటి పురందేశ్వరి సైతం పోటీ చేయాలని యోచిస్తున్నారట. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఇద్దరు ప్రముఖ నేతలు ఒకే నియోజకవర్గం వైపు చూడటం.. ఆసక్తికరంగా మారింది.
వైజాగ్ ఎంపీ టికెట్‌పై అటు జీవీఎల్, ఇటు చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇరువురి మధ్య టికెట్ వార్ నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచే పోటీ చేయాలని ఇద్దరూ తమ తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో కొన్నాళ్లుగా పార్టీ పరంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట జీవీఎల్. ఇటీవలే విశాఖలో జీవీఎల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మరోవైపు విశాఖ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, డెవలప్‌మెంట్‌పైనే జీవీఎల్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక జీవీఎల్ బర్త్ డే నేపథ్యంలో ఆయన అనుచరులు విశాఖ సిటీ అంతా “GVL 4 VIZAG” పోస్టర్లు అతికించారు. గతంలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన చిన్నమ్మ (పురందేశ్వరి).. కూడా తగ్గేదే లేదన్నట్లు ఉన్నారట. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ పరిణామాలతో హైకమాండ్ ఎవరివైపు ఉంటుందోనని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
అధికార పార్టీపై ఒకరిని మించి ఒకరు విమర్శలు..
విశాఖ పార్లమెంటు సీటుపై ఇరువు నేతల పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్నామధ్య విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకుల కిడ్నాప్ ఉదంతంపై జీవీఎల్ రియాక్ట్ అయ్యారు. విశాఖలో భూ మాఫియా చెలరేగిపోతోందంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. విశాఖ భూదందాపై దర్యాప్తు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే సీఎం భూసెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు జీవీఎల్. వైసీపీ అంటే రాక్షస సంత అని ప్రకటించుకోవాలంటూ ఓ రేంజ్‌లో ఒంటికాలిపై లేచినంత పని చేశారు. ఏపీలో ఇసుక, మైనింగ్ పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశార.
చిన్నమ్మ కూడా తగ్గట్లేదు..
కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన దగ్గుబాటి పురందేశ్వరి.. గతంలో బాపట్ల, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో బీజేపీలో చేరిన ఆమె.. మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒడిశా రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జిగానూ కొంత కాలం వ్యవహరించారు. ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రీసెంట్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ వ్యవహారంపై చిన్నమ్మ ఘాటుగా స్పందించారు. సీబీఐ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి కేసు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూనే.. వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో అధికార పార్టీ ఆగడాలు ఇకపై సాగబోవని హెచ్చరించారు. వైసీపీ అరాచకాలపై చార్జ్ షీట్ ద్వారా ప్రజల్లోకి వెళ్తామని ఆమె స్పష్టం చేశారు. ఏపీలో జనసేనతోనే పొత్తు కొనసాగుతుందని పనిలో పనిగా కామెంట్ చేశారు పురందేశ్వరి.
ఇలా ఒకరిని మించి మరొకరు అధిష్టాన పెద్దల దృష్టిలో పడాలని, విశాఖ ఎంపీ సీటు ఖాయం చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, వాస్తవానికి బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో ఉంటే కూడా విశాఖ ఎంపీ సీటు గెలుచుకొనే అవకాశాలు గగనమే. అధికార పార్టీ బలం ముందు ప్రతిపక్షాలు తట్టుకోగలవా? జగన్ సంక్షేమ కార్యక్రమాలు, జగన్ బ్రాండ్ ఇమేజ్ ముందు నిలవగలరా? అనేది ఎన్నికలు వస్తేగానీ తెలియదు.
Read Also : New Presidents to BJP: అధ్యక్షుల మార్పు.. ఎన్నికల్లో ఫలితమిస్తుందా? బీజేపీ వ్యూహాత్మక అడుగులు!