New Presidents to BJP: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించింది. కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిని కూడా మార్చడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఎంపీ బండి సంజయ్.. (Bandi Sanjay) ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాతో (JP Nadda) ఇవాళ సమావేశమయ్యారు. జాతీయ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. (New Presidents to BJP)
తెలంగాణ (Telangana BJP) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Kishan Reddy) లేదా ఈటల రాజేందర్ (Etela Rajendar) లేదా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలలో (Komatireddy Rajagopal Reddy) ఎవరో ఒకరికి చాన్స్ దక్కనుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, కిషన్‌రెడ్డివైపే అధిష్టానం మొగ్గు చూపింది. కిషన్‌రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. రానున్న కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తాజాగా స్టేట్ చీఫ్‌గా కిషన్‌రెడ్డి నియామకం అయ్యారు. దీంతో ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్‌కి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంతకు ముందు రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జేపీ నడ్డా పలువురు నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ను ఢిల్లీ పిలిపించుకొని చర్చలు జరిపారు. అనంతరం బండి సంజయ్‌కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో తన సన్నిహితుల వద్ద స్టేట్ చీఫ్ పదవి పోయినట్లేనంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. తొలుత ముంబై వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్.. జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఇవాళ స్టేట్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.
ఏపీలో అనూహ్య పరిణామం..
ఏపీ (AP BJP) అధ్యక్షుడిని మార్పు చేస్తున్నారనే విషయం ఆఖరి నిమిషం వరకు రివీల్ కాలేదు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు (Somu Veerraju) ఇవాళ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ టెర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి చెప్పారని సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. తనకు పార్టీలో కొత్త బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారని సోము చెప్పారు. సోము వీర్రాజును తొలగించిన అంశం ఇప్పుడు ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ అయ్యింది. తనను రాజీనామా చేయాలని జేపీ నడ్డా సూచించారని సోము వీర్రాజు వెల్లడించారు.
చంద్రబాబుపై అంతెత్తున లేచే సోము వీర్రాజును తొలగించడం.. టీడీపీ-బీజేపీ పొత్తుకు అడుగులు పడినట్లయిందని అప్పుడే విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా చిన్నమ్మ పురందేశ్వరిని (Purandeswari) ఏపీ అధ్యక్షురాలిగా నియమిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా (TDP-BJP-Janasena) వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని పోటీ చేసి అధికారంలోకి రావాలని యోచిస్తున్నతరుణంలో ఈ మార్పు ప్రతిపక్షానికి కలిసొచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. పురందేశ్వరికి గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. మరోవైపు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి (Ex CM Kiran Kumar Reddy) కూడా అధిష్టానం కొత్త బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యవర్గం కమిటీలో కిరణ్‌కుమార్ రెడ్డికి చోటు దక్కింది.