CM YS Jagan Review: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. (CM YS Jagan Review)
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూయించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటమట్టం 49.60 అడగులు ఉందని, రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ఇది రేపటికి సుమారు 16 లక్షలకు చేరుకుని.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారని తెలిపారు. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చూశామని తెలిపారు.

కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎం సూచించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని స్పష్టం చేశారు. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలన్నారు. ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పనిచేయాలన్నారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీలు చేశారన్నారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు సహాయశిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలని జగన్ సూచించారు. శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు సదుపాయాలమీద ధ్యాస పెట్టాలని, అదే టైంలో.. సహాయ శిబిరాల నుంచి బాధితులను తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే వారికి రూ.1000 ఇవ్వాలని సీఎం సూచించారు.
కచ్చా ఇంటి విషయంలో వర్గీకరణ వద్దు..
కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దని సీఎం సూచించారు. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరమని పేర్కొన్నారు. అలాంటి వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని సూచించారు. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదన్నారు.
వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి చర్యలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న మెసేజ్ అందించాలన్నారు. అత్యంత పారదర్శకత పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలని స్పష్టం చేశారు.
Read Also : DGP Rajendranath Reddy: అదృశ్యమైన 26 వేల మందిలో 23 వేల మందిని గుర్తించాం..: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి