DGP Rajendranath Reddy: రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కడపలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పరోక్షంగా పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 26 వేల మందే అదృశ్యమైనట్లు లెక్కలున్నాయన్నారు. అదృశ్యమైన 26 వేల మందిలో 23 వేల మందిని గుర్తించామన్నారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో పోలీసు శాఖ ఉందని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో మహిళలు అదృశ్యమైనట్లు తేలిందన్నారు. (DGP Rajendranath Reddy)
30 వేల మంది అదృశ్యమైనట్లు తెలియకుండా లెక్కలు చెబుతున్నారని, ఇది సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. గతేడాది విశాఖలో 7 వేల ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా గంజాయికి లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు. ఇప్పుడు గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒడిశా నుంచి రవాణా అవుతుందన్నారు. ఒడిశా, విశాఖ నుంచి రవాణా కాకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ పేర్కొన్నారు.
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో డీజీపీ పర్యటన
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ పోలీసులు సమర్థ వంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్‌లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదన్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలో గత 6 నెలల కాలంలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో పరిశీలించామన్నారు. 2020, 2021, 2022 మొదటి అర్థ సంవత్సరం (జనవరి నుండి జూన్ వరకు) నేర గణాంకాలను 2023 తో పోల్చి చూడగా, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం ముదావహమన్నారు.
Read Also : Vasireddy Padma on Pawan: మహిళలను గౌరవించే చరిత్ర బాబు, పవన్‌కు లేదు : వాసిరెడ్డి పద్మ ఫైర్
ఏపీ పోలీసులు, గ్రామీణ మహిళా పోలీసులు, వార్డు మహిళా పోలీసులు అందరూ కలిసి కట్టుగా గ్రామాల్లో, వార్డుల్లో తిరుగుతూ ప్రజల భూ సమస్యలు, ఇంటి సమస్యలు, కుటుంబ కలహాలు, అసాంఘిక నేరస్తుల కదలికలఫై నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించడం తదితర ప్రొయాక్టివ్ మెజుర్స్ వల్ల గ్రామాలలో గొడవలు/ దొమ్మీ, కుటుంబకలహాలు లాంటి కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. నేరాల నిరోధానికి ఈ-బీట్స్ ద్వారా గస్తీని ముమ్మరం చేశామన్నారు.
రాష్ట్రం లో మహిళా రక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించిన దిశ యాప్‌కు మహిళలతో పాటు రాష్ట్రం లోని ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 1,24,38,335 మంది యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. జిల్లాల వారీగా ఆరు నెలల వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 2022తో పోలిస్తే 2023 లో కర్నూలు జిల్లాలో 38% తగ్గగా, కడప జిల్లాలో 36%, అన్నమయ్య జిల్లాలో 9.5%, నంద్యాల జిల్లాలో 25% నేరాల సంఖ్య తగ్గిందని వెల్లడించారు.
సైబర్ నేరాల నియంత్రణ..
సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేక సైబర్ సెల్‌లు ఏర్పాటు చేయడం తో పాటు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సైబర్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ అధికారి పర్యవేక్షణలో సిబ్బందికి సైబర్ నేరాల నియంత్రణ కోసం కీలకమైన అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించి సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ వెల్లడించారు.
Read Also : AP DGP: ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు.. వారిని పోలీసు విధులకు వినియోగించవద్దని స్పష్టీకరణ