YS Jagan PC: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో నారాసుర రక్తచరిత్ర సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచే ధైర్యం లేకనే చంద్రబాబు ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనీయకుండా దాడులు, అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి వాచ్‌మెన్లుగా మారారని, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు ఎక్స్‌టెన్షన్ గవర్నమెంట్‌గా వ్యవహరిస్తోందని విమర్శించారు. పుంగనూరు, పులివెందుల, తిరుపతి, కడప, రాయచోటి, రాజంపేట సహా రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై జరుగుతున్న దాడులు, నామినేషన్ పత్రాల చించివేత, పోలీసుల దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలను ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తమ పోరాటం ఆగబోదని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టానికి సమాధానం చెప్పాల్సిందేనని హెచ్చరించారు.
నామినేషన్ వేయడమూ నేరమేనా?
ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడం అభ్యర్థుల హక్కని, ఆ కనీస అవకాశాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని వైయస్ జగన్ మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద ముందుగానే టీడీపీ మూకలను మోహరించడం, ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు లాక్కోవడం, పోలీసుల సమక్షంలోనే వాటిని చించివేయడం వంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రిటర్నింగ్ అధికారుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను కూడా టీడీపీ శ్రేణులు లాక్కుంటున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు ప్రకటించిన రెండో రోజే నామినేషన్లు ప్రారంభించి, కేవలం మూడు రోజుల గడువు ఇవ్వడం వెనుక కుట్ర ఉందన్నారు. అధికార పార్టీకి రిజర్వేషన్ల వివరాలు ముందుగానే తెలిసేలా చేసి, ప్రతిపక్షానికి సన్నద్ధమయ్యే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని, బైండోవర్ పేరుతో అభ్యర్థులను బెదిరించారని తెలిపారు.
ప్రజాబలం ఉంటే భయమెందుకు?
ప్రజల మద్దతు ఉందని భావిస్తే వైయస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రబాబును జగన్ నిలదీశారు. పోలీసులతో అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? పార్టీ నాయకులపై దాడులు ఎందుకు చేయిస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను గాలికొదిలేసి, అన్నీ అమలు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలకు వెళ్లడం, వార్డులు, డివిజన్లను ఇష్టానుసారం మార్చడం, వైయస్సార్‌సీపీ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాలను విడగొట్టడం, పోలింగ్ కేంద్రాలను దూరంగా ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 45 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ప్రత్యేక సవరణలో వెల్లడైందని పేర్కొన్న జగన్.. ఓటర్ల తుది జాబితా రాకముందే ఎన్నికలకు వెళ్లడం వెనుక కుట్ర ఉందన్నారు.
పుంగనూరులో ఎంపీపైనే హత్యాయత్నం
పుంగనూరులో వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన మిథున్‌రెడ్డిని టీడీపీ మూకలు అడ్డుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఆయన భద్రతా సిబ్బందికి తలలు పగిలేలా దాడి చేశారని, వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. మూడు గంటలపాటు వేచి చూసినా నామినేషన్లు స్వీకరించలేదన్నారు. దాడి అనంతరం ధ్వంసమైన వాహనాల్లో మద్యం సీసాలు పెట్టి ఎంపీపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కార్లు తిరగబడినా, ధ్వంసమైనా మద్యం సీసాలు నిటారుగా ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. మిథున్‌రెడ్డి మద్యం సేవించరని, ఆయనపై బురదజల్లేందుకు ఈ కుట్ర చేశారని ఆరోపించారు. అదే నామినేషన్ కేంద్రం వద్ద శాప్ ఛైర్మన్ రవినాయుడు పోలీసుల మైక్ తీసుకుని దాడులు చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. సంబంధిత వీడియోలను మీడియాకు ప్రదర్శించారు.
తిరుపతిలో మేయర్ అభ్యర్థికి అవమానం
తిరుపతిలో వైయస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వాసూ యాదవ్‌ను నామినేషన్ వేయనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. ఆయన వెంట వెళ్లిన తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తిని కూడా అడ్డుకున్నారని, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారని తెలిపారు. మధ్యాహ్నం మరోసారి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా స్పందించలేదని విమర్శించారు. వాసూ యాదవ్ తన తల్లితో కలిసి వర్షంలో తడుస్తూ ఆందోళన చేసిన వీడియోను ప్రదర్శించారు. తన ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయానికి తిరుపతిలో ఒక్క కార్పొరేటర్ అభ్యర్థి కూడా నామినేషన్ వేయలేదని, మేయర్ అభ్యర్థి మాత్రం తీవ్ర ప్రయత్నాల తర్వాత నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు.
కడపలో కత్తులతో దాడులు
కడప కార్పొరేషన్ పరిధిలో వైయస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా కత్తులతో దాడులు చేయించారని జగన్ మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్‌పై కత్తితో దాడి చేశారని, తన మరదలితో నామినేషన్ వేయించేందుకు వెళ్లిన మాజీ డిప్యూటీ మేయర్‌పైనా దాడి జరిగిందన్నారు. నామినేషన్లు వేయడానికి వస్తే చంపేస్తామని కడప ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులురెడ్డి బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనలన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళలను సైతం వదలకుండా దాడులు చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపైనా దాడులా చంద్రబాబూ?
రాజంపేటలో వైయస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీసీ మహిళపై, ఆమె తండ్రిపై దాడి జరిగిందని జగన్ తెలిపారు. పుంగనూరులో తొమ్మిదో వార్డు అభ్యర్థి నయాజ్ తన భార్యతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా పోలీసుల సమక్షంలోనే దాడి చేసి పత్రాలు లాక్కున్నారని వివరించారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదని, అలాంటి మహిళలపైనా దాడులు చేయించడం చంద్రబాబుకు సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.
పులివెందులలో పోలీసులే గుండాలు!
పులివెందులలో జరిగిన పరిణామాలు పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో తెలియజేస్తున్నాయని జగన్ విమర్శించారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించి ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ఎస్పీ, డీఐజీల దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లగా మధ్యాహ్నం 1.30 గంటలకు రావాలని సూచించారని తెలిపారు. ఆ సమయానికి అవినాష్‌రెడ్డి వెళ్లగానే పోలీసులే అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారని, ఏకే–47తో గాల్లోకి కాల్పులు జరిపారని ఆరోపించారు. పోలీసులే కార్లను ధ్వంసం చేశారని, రాళ్లు విసిరారని మండిపడ్డారు. ఇప్పటివరకు టీడీపీ మూకలకు సహకరించిన పోలీసులు పులివెందులలో స్వయంగా గుండాల పాత్ర పోషించారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
రాయచోటిలో కార్యాలయానికి నిప్పు
రాయచోటిలో వైయస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉండగానే టీడీపీ శ్రేణులు దాడి చేసి కార్యాలయానికి నిప్పు పెట్టాయని జగన్ ఆరోపించారు. బయట ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారని, ఛైర్మన్ అభ్యర్థిపై వరుసగా మూడు రోజులుగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బద్వేలులో ఆర్వో కార్యాలయంలోకి చొరబడి ఇప్పటికే దాఖలైన నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు. దర్శిలోనూ అభ్యర్థులను అడ్డుకున్నారని, దాచేపల్లిలో ఛైర్మన్ అభ్యర్థి ఇంట్లో పోలీసులే తెలంగాణ మద్యం పెట్టి అక్రమ మద్యం కేసుతో అరెస్టు చేశారని విమర్శించారు. పిడుగురాళ్లలో అభ్యర్థిని పోలీసులు తీసుకెళ్లిన వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
నామినేషన్లే వేయలేని దుస్థితి
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో వైయస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని జగన్ వివరించారు. బద్వేలులో 14 వార్డులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా గతంలో దాఖలు చేసిన పత్రాలనే చించివేశారని తెలిపారు. కమలాపురం, ఎర్రగుంట్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని, జమ్మలమడుగులో ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ వేయలేకపోయారని పేర్కొన్నారు. రాయచోటిలో 44 డివిజన్లలో ఒక్క నామినేషన్ కూడా పడలేదని, పుంగనూరులోనూ అదే పరిస్థితి ఉందన్నారు. దర్శి, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో ఛైర్మన్ అభ్యర్థులతో సహా పార్టీ నేతలను అడ్డుకున్నారని, పులివెందులలోనూ నామినేషన్లకు ఆటంకాలు సృష్టిస్తున్నారని వివరించారు. ప్రతిపక్షం ఎన్నికల్లో పోటీ చేయకుండానే గెలవాలన్న కుట్రలో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
చంద్రబాబు కనుసన్నల్లో ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట వ్యవహారశైలిపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన కమిషన్ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ శ్రేణులు మారణాయుధాలతో గుమిగూడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, వైయస్సార్‌సీపీ తరఫున నలుగురైదుగురు నిబంధనల ప్రకారం వెళ్లినా అడ్డుకుంటున్నారని తెలిపారు. రిటర్నింగ్ అధికారుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుంటున్నా చర్యలు లేవన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎస్‌ఈసీ, డీజీపీ, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన బాధ్యతను నిర్వర్తించాలే తప్ప రాజకీయ నాయకుల ఆదేశాలకు లోబడకూడదని స్పష్టం చేశారు.
మా హయాంలో ప్రజాతీర్పు అలా!
వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలను జగన్ గుర్తుచేశారు. అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయని, ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసిన పరిస్థితుల్లోనూ తమ పార్టీ ఘనవిజయం సాధించిందన్నారు. మొత్తం 724 కార్పొరేషన్ డివిజన్లలో 616 డివిజన్లు, 88 మున్సిపాలిటీల్లో 86 మున్సిపాలిటీలు తమ పార్టీ గెలుచుకుందని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 99 స్థానాల్లో 97 కైవసం చేసుకున్నామని వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అప్పటికే 95 శాతం అమలు చేశామని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఫ్యామిలీ డాక్టర్, పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం వంటి విప్లవాత్మక కార్యక్రమాల వల్లే ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించారని తెలిపారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలే తప్ప ప్రత్యర్థులను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూడటం సరికాదన్నారు.
ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరం
2024 సాధారణ ఎన్నికల ఫలితాలపైనా జగన్ మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై తాను ప్రశ్నించానని, కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారని తెలిపారు. ఎన్నికల సంఘాల నియామక విధానంలో మార్పులు తీసుకురాకపోతే ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కష్టమన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయించేలా వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రస్తుత నియామక విధానానికి తాము మద్దతిచ్చామని, ఆ నిర్ణయం తప్పని ఇప్పుడు భావిస్తున్నామని పేర్కొన్నారు.
తప్పు చేసిన వారిని వదలం!
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారులు, టీడీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని జగన్ హెచ్చరించారు. నామినేషన్ల గడువు ముగిసే వరకు వైయస్సార్‌సీపీ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ నిలబడిన ప్రతి కార్యకర్తకు, ప్రజాస్వామ్యవాదికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చంద్రబాబుకు శాల్యూట్ చేయడం కాదని, రాజ్యాంగానికి విధేయులుగా పనిచేయాలని హితవు పలికారు. నేడు అధికారం ఉందని చేస్తున్న అన్యాయాలకు భవిష్యత్తులో చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఇప్పుడు నాటుతున్న విత్తనాలు రేపు చెట్లవుతాయని హెచ్చరించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, 2029 సాధారణ ఎన్నికలు ఫినిషింగ్ లైన్ అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రజల పక్షాన నిలబడేందుకు వైయస్సార్‌సీపీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Read also: YS Jagan: రాష్ట్రంలో ఒక్క అభ్యర్థి నామినేషన్ వేయలేకపోయినా ఎస్‌ఈసీదే బాధ్యత: వైఎస్ జగన్
YS Jagan: చంద్రబాబుగారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి!: వైఎస్ జగన్






