ఆదివారం, 18 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan: రాష్ట్రంలో ఒక్క అభ్యర్థి నామినేషన్‌ వేయలేకపోయినా ఎస్‌ఈసీదే బాధ్యత: వైఎస్ జ‌గ‌న్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 18 అక్టోబర్ 2026

YS Jagan: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైయస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా సాగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ వేయలేకపోయానని చెప్పే పరిస్థితి ఉండకూడదని, అలా జరిగితే పరువు పోయేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌సీపీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, దాడులు, అక్రమ అరెస్టులు, పోలీసుల ఏకపక్ష వైఖరికి సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషనర్‌కు అందజేశారు. అవసరమైతే నామినేషన్ల గడువును పొడిగించి, ఎస్పీల పర్యవేక్షణలో ప్రతి అభ్యర్థితో నామినేషన్‌ వేయించాలని కోరారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించాలని, పోలింగ్‌ మొదలు ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను సీసీ కెమెరాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమైన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు.

ఒక్క నామినేషన్‌ ఆగినా బాధ్యత మీదే!

రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క అభ్యర్థి తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా నామినేషన్‌ వేయనివ్వలేదని చెప్పే పరిస్థితి తలెత్తితే అది ఎన్నికల సంఘం వైఫల్యమే అవుతుందని జగన్‌ స్పష్టం చేశారు. నామినేషన్లకు ఆటంకాలు ఎదురవుతున్న ప్రాంతాల్లో జిల్లా ఎస్పీలే స్వయంగా పోలీసు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసి అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు అందిన తాజా సమాచారంతో కూడిన జాబితాను ఎన్నికల కమిషనర్‌కు అందజేసినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అక్కడే ఉంచినట్లు వివరించారు. అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అవసరమైన పోలీసు రక్షణ కల్పిస్తామని, అవసరమైతే గడువు పొడిగించి అయినా ప్రక్రియ పూర్తి చేయిస్తామని ఎన్నికల కమిషనర్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

అరెస్టు చేసిన అభ్యర్థులను తీసుకురావాలి

గురజాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో వైయస్సార్‌సీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులను పోలీసులే తప్పుడు కేసులతో అరెస్టు చేసి పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారని జగన్‌ ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆ అభ్యర్థులను తీసుకొచ్చి పోలీసు రక్షణతో నామినేషన్లు వేయించాలని కోరారు. అభ్యర్థులను అరెస్టు చేసి ఎన్నికల బరి నుంచి తప్పించే పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలోనే ఇన్ని ఆటంకాలు సృష్టిస్తుంటే ఇక ఎన్నికలు స్వేచ్ఛగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.

కేంద్ర బలగాలను దించాల్సిందే!

రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా చంద్రబాబు ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందని, అందువల్ల స్థానిక ఎన్నికలను కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. నామినేషన్‌ కేంద్రాలకు వైయస్సార్‌సీపీ అభ్యర్థులు పరిమిత సంఖ్యలో వెళ్తుంటే, అక్కడ అప్పటికే వందల మంది టీడీపీ శ్రేణులు మారణాయుధాలతో మోహరించి ఉంటున్నారని ఆరోపించారు. అభ్యర్థులు వచ్చిన వెంటనే వారి చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడి నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించాలని ఎస్‌ఈసీని కోరినట్లు తెలిపారు. ఇదే అంశంపై సాయంత్రం గవర్నర్‌ను కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు.

పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు లైవ్‌

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ఫుటేజీని ప్రజలకు అందుబాటులో ఉంచాలని జగన్‌ కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏం జరుగుతుందో సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి లైవ్‌ ఫీడ్‌ను ప్రజలు వీక్షించేలా చూడాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, స్ట్రాంగ్‌రూమ్‌లలో బ్యాలెట్‌ బాక్సులను మార్చే ప్రయత్నాలు జరుగుతాయేమోనన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు ఉండాలని, పోలింగ్‌ అనంతరం నమోదయ్యే పత్రాలు, సంతకాల పరిశీలన కూడా కెమెరాల పర్యవేక్షణలో జరగాలని కోరారు. ముఖ్యంగా ఫారం 17సీకి సంబంధించిన సంతకాల ధ్రువీకరణ ప్రక్రియలో ఎలాంటి ఫోర్జరీలకు అవకాశం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లను పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు గతంలోనూ ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా అందజేశారని, ఇప్పుడు మరోసారి స్వయంగా వివరించినట్లు తెలిపారు.

హామీల అమలుతోనే చిత్తశుద్ధి తెలుస్తుంది

తమ వినతులన్నింటినీ ఎన్నికల కమిషనర్‌ సానుకూలంగా విన్నారని జగన్‌ తెలిపారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తామని, అవసరమైతే గడువును పొడిగిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఎన్నికల సంఘం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తుందా లేదా అన్నది ఆ హామీల అమలుతోనే తేలుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే స్వేచ్ఛ ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కులని గుర్తుచేశారు. ఆ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్‌పైనే ఉందని స్పష్టం చేశారు.

పోలీసు వ్యవస్థను మాఫియాగా మార్చారు!

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని జగన్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఐజీల నుంచి డీఎస్పీలు, సీఐల వరకు కొందరు అధికారులు ఒక సిండికేట్‌గా ఏర్పడ్డారని ఆరోపించారు. ఒకే ప్రాంతంలో రెండేళ్లకు మించి కొనసాగించకూడదనే నిబంధనలను పట్టించుకోకుండా రెండున్నరేళ్లుగా అదే అధికారులను కొనసాగిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలతో కలిసి ఇసుక, మద్యం వ్యాపారాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ సొమ్మును అధికార పార్టీ నేత‌ల‌కు పంచుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అధికారులతోనే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రజలకు సేవ చేయడం మానేసి చంద్రబాబుకు వాచ్‌మెన్లుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ కార్యకర్తలా డీఐజీ తీరు

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి డీఐజీ కోయ ప్రవీణ్‌ చేసిన వ్యాఖ్యలను జగన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసు అధికారిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఆయన టీడీపీ కార్యకర్త మాదిరిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన వృత్తిధర్మాన్ని, పోలీసు యూనిఫామ్‌పై ఉన్న జాతీయ చిహ్నం గౌరవాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థలో ఆయన కూడా ఒక పావుగా మారారని ఆరోపించారు.

మిథున్‌పై దాడికి సీఆర్పీఎఫ్‌ సాక్ష్యం

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడికి ఆయన వెంట ఉన్న సీఆర్పీఎఫ్‌ భద్రతా సిబ్బందే ప్రత్యక్ష సాక్షులని జగన్‌ స్పష్టం చేశారు. అభ్యర్థులతో కలిసి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన మిథున్‌రెడ్డిపై అక్కడే టీడీపీ శ్రేణులు దాడి చేశాయని తెలిపారు. ఒక అభ్యర్థి వెంట వెళ్లేందుకు అనుమతించిన నలుగురిలో ఒకరిగా మాత్రమే ఎంపీ అక్కడికి వెళ్లారని వివరించారు. వేలాది మంది టీడీపీ కార్యకర్తలు గుమిగూడి దాడి చేసినా పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. మూడు గంటలపాటు అక్కడే నిర్బంధించి నామినేషన్లు కూడా స్వీకరించలేదని మండిపడ్డారు. ఆయన వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా, అందులో మద్యం సీసాలు పెట్టి తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆరోపించారు. వాహనాలు బోల్తాపడినా మద్యం సీసాలు మాత్రం నిటారుగా ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. మిథున్‌రెడ్డికి మద్యం సేవించే అలవాటు లేదని, అయినా ఆయనపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. సీఆర్పీఎఫ్‌ సిబ్బంది జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని, వారి ప్రత్యక్ష సాక్ష్యం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

నిమ్మగడ్డ హయాంలోనూ ఘనవిజయమే!

వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలను జగన్‌ గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉన్నారని, ఆయన చంద్రబాబుకు అత్యంత సానుభూతిపరుడని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే అనేక మంది కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలను బదిలీ చేశారని తెలిపారు. అంతటి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్లే స్థానిక ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ అఖండ విజయాలు సాధించిందని వివరించారు.

హామీల అమలులో చంద్రబాబు విఫలం

చంద్రబాబు ప్రభుత్వంలో సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల అమలు లేదని జగన్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ పంపిన బాండ్లను ప్రజలు ఇప్పుడు చూపిస్తూ తమకు రావాల్సిన సొమ్ము ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యా దీవెన, వసతి దీవెన, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత వంటి రంగాలన్నీ కుదేలయ్యాయని ఆరోపించారు. పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగానే చంద్రబాబు స్వేచ్ఛగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని విమర్శించారు. అందుకే పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

దౌర్జన్యాలన్నీ తిరిగి చుట్టుకుంటాయి

ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఓటు వేసే స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాదులని జగన్‌ స్పష్టం చేశారు. వాటిని కాలరాసేందుకు ఎవరు ప్రయత్నించినా ప్రజలు గమనిస్తూనే ఉంటారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, ఎన్నికల ప్రక్రియలో సృష్టిస్తున్న అడ్డంకులు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోలేవన్నారు. ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రతి అభ్యర్థికి నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని మరోసారి కోరారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని, చంద్రబాబు చేస్తున్న దౌర్జన్యాలన్నీ చివరకు ఆయనకే చుట్టుకుంటాయని హెచ్చరించారు.

Read also: YS Jagan: చంద్ర‌బాబుగారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి!: వైఎస్ జ‌గ‌న్

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading