HomeCinemaAnushka Shetty: ‘రుద్రమదేవి’ కోసం అసలు బంగారు నగలు ధరించా.. గుర్రం అంటే ఇప్పటికీ భయమే!

Anushka Shetty: ‘రుద్రమదేవి’ కోసం అసలు బంగారు నగలు ధరించా.. గుర్రం అంటే ఇప్పటికీ భయమే!

Anushka Shetty: టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో ఆమె తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా చారిత్రక పాత్రల్లో అనుష్క చూపించిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలు, తన భయాలు, సినిమా ఎంపికల గురించి అనుష్క పంచుకున్న ఆసక్తికర విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘బాహుబలి’ సక్సెస్ అయినా.. మొదటి భాగంపై సందేహాలే
‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించినప్పటికీ, తొలి భాగంలో తన పాత్రకు గ్లామర్ తక్కువగా ఉండటంపై అప్పట్లో చాలామంది చర్చించారని అనుష్క గుర్తు చేసుకున్నారు. అయితే రెండో భాగంలో దేవసేన పాత్రకు వచ్చిన స్పందన తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని చెప్పారు. తన దృష్టి ఎప్పుడూ సినిమా విజయం లేదా కలెక్షన్లపై కాకుండా, పాత్ర కోసం పడే కష్టం, షూటింగ్ సమయంలో చేసే శ్రమపైనే ఉంటుందని ఆమె వెల్లడించారు.”షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే నాకు టెన్షన్ ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా నేను ఎక్కువగా ఆలోచించను” అని అనుష్క పేర్కొన్నారు.

‘రుద్రమదేవి’ తర్వాత ఒక భయం వెంటాడింది
‘బాహుబలి’ వంటి భారీ విజయం తర్వాత విడుదలైన ‘రుద్రమదేవి’ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా? అనే ఆందోళన తనలో ఉండేదని అనుష్క తెలిపారు. అయితే దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రం కోసం చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.”ఒక మహిళా ప్రధాన పాత్రతో ఇంత భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. గుణశేఖర్ గారు కథను నమ్మి ఎంతో శ్రమించారు” అని ఆమె చెప్పారు.అయితే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, నిర్మాతలు, పంపిణీదారులకు ఆశించిన స్థాయిలో ఆర్థిక లాభాలు రాలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

రుద్రమదేవి చరిత్ర విని ఆశ్చర్యపోయా
రుద్రమదేవి పాత్ర అంగీకరించే ముందు కాకతీయ సామ్రాజ్యం గురించి తనకు చాలా పరిమిత సమాచారం మాత్రమే ఉందని అనుష్క చెప్పారు. గుణశేఖర్ దాదాపు మూడు గంటల పాటు కథ, చారిత్రక నేపథ్యాన్ని వివరించిన తర్వాతే ఆ పాత్ర గొప్పతనం తనకు అర్థమైందన్నారు. దక్షిణ భారతదేశ చరిత్రలో ఇంత గొప్ప మహిళా పాలకురాలు ఉన్నప్పటికీ, ఆమె గురించి చాలామందికి తెలియకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మన చరిత్రను మరింతగా చదవాలని కూడా సూచించారు.

గుర్రం అంటే ఇప్పటికీ భయమే
‘రుద్రమదేవి’లో గుర్రపు స్వారీ, కత్తియుద్ధాలు, యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నప్పటికీ, గుర్రాలంటే ఇప్పటికీ తనకు భయమేనని అనుష్క చెప్పారు. గుర్రాలు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో అర్థం కాకపోవడం వల్ల భయపడుతుంటానని తెలిపారు. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో హీరో రానా దగ్గుబాటి గుర్రంపై నుంచి పడిపోయిన ఘటనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఏనుగుపై స్వారీ చేయడం మాత్రం తనకు చాలా ప్రశాంతంగా అనిపించేదని చెప్పారు. కానీ ఒక యుద్ధ సన్నివేశంలో ఏనుగు ఒక్కసారిగా భయపడి కదలడంతో తాను కూడా తీవ్రంగా భయపడినట్లు వెల్లడించారు.

రుద్రమదేవిలో నిజమైన బంగారు నగలే
సాధారణంగా తనకు మేకప్, భారీ ఆభరణాలు, అలంకరణలంటే పెద్దగా ఇష్టం ఉండదని అనుష్క తెలిపారు. కానీ చిన్నప్పటి నుంచి తన తల్లి “ఒకసారి అయినా రాణిలా భారీ బంగారు ఆభరణాలు ధరించి సినిమా చేయాలి” అని కోరుకునేవారని చెప్పారు. ఆ కోరిక ‘రుద్రమదేవి’ సినిమాతో నెరవేరిందని వెల్లడించారు.

ఆ సినిమాలో తాను ధరించిన ఆభరణాలు నిజమైన బంగారంతో తయారు చేసినవేనని, వాటి బరువును మోయడం షూటింగ్ సమయంలో చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు. ఇప్పుడు తన తల్లి మరోసారి ఒక మత్స్యకారిణి పాత్రలో తనను చూడాలని కోరుకుంటున్నారని అనుష్క నవ్వుతూ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మళ్లీ ఎప్పుడు వెండితెరపై?
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత అనుష్క కొత్త ప్రాజెక్టులపై పెద్దగా ప్రకటనలు చేయలేదు. అయితే ఆమె తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని అనుష్క గతంలోనే స్పష్టం చేశారు.

ఇవీ చ‌ద‌వండి: Anushka Shetty: అనుష్క శెట్టి ‘కథనార్’పై వైరల్ అవుతున్న రూమర్లు
Anushka Shetty: అనుష్క పెళ్లి వదంతులు మళ్లీ వైరల్.. అసలు నిజం ఏంటి? స్వీటీపై ట్రోలింగ్ ఎందుకు?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు