Indian Railways: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఎల్పీజీ సరఫరా అంతరాయం కలగడంతో దేశంలో గ్యాస్ కొరత పెరిగింది. ఈ పరిస్థితి హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఇప్పుడు రైల్వే క్యాటరింగ్ సేవలపైనా ప్రభావం చూపుతున్నట్లు సమాచారం.
క్యాటరింగ్ సేవలు నిలిపివేతపై ఆలోచన
ప్రస్తుతం భారత రైల్వేల్లో ప్రయాణికులకు తాజా ఆహారాన్ని అందించే బాధ్యతను Indian Railway Catering and Tourism Corporation నిర్వహిస్తోంది. అయితే ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా రైళ్లలో వండే ఆహారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు రైళ్లలో క్యాటరింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది Indian Railways రైల్వే బోర్డు అని అధికారులు తెలిపారు.
రోజుకు 17 లక్షల భోజనాల సరఫరా
రైల్వే ప్రయాణికులకు అందించే భోజనం ప్రధానంగా ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్లలో తయారవుతుంది. అక్కడ నుంచి పాంట్రీ కార్లకు పంపించి ప్రయాణికులకు అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్లు మరియు ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 17 లక్షల భోజనాలు ప్రయాణికులకు అందిస్తున్నాయి. అయితే గ్యాస్ సరఫరా ఇలాగే అంతరాయం కలిగితే ఈ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఫుడ్ బుకింగ్ చేసిన వారికి రీఫండ్
ప్రస్తుతం ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆహారం కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే క్యాటరింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తే ఇప్పటికే ఫుడ్ బుక్ చేసిన ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం
గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు ఆహార సేవలు పూర్తిగా ఆగిపోకుండా ఉండేందుకు ఐఆర్‌సీటీసీ కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్లాజాలకు ఇండక్షన్ స్టవ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్లు ఉపయోగించాలని సూచించింది. అలాగే రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచాలని సూచించింది.
స్టేషన్లలో ఆహార సేవలు కొనసాగుతాయి
రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్లాజాలు, అలాగే జన్ ఆహార్ అవుట్‌లెట్లు సాధారణంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ప్రయాణికులకు ఆహారం, పానీయాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్ని క్యాటరింగ్ యూనిట్లకు సూచనలు ఇచ్చింది.
గ్యాస్ కొరత సమస్య కొనసాగితే దేశవ్యాప్తంగా రైల్వే క్యాటరింగ్ సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఇవీ చదవండి: Longest Train Route: ప్రపంచంలోనే పొడవైన ట్రైన్ జర్నీ – 21 రోజులు, 13 దేశాలు!
Train Journey: రైలు ప్రయాణంలో హెల్త్ ఎమర్జెన్సీ? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
