TFJA: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) తాజాగా విడుదల చేసిన ప్రకటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసోసియేషన్ పేరును దుర్వినియోగం చేస్తూ, సోషల్ మీడియా వేదిక ‘X’ (ట్విట్టర్)లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ VSN మూర్తిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
TFJA అధికారిక లెటర్ హెడ్‌పై విడుదలైన ప్రకటనలో, “VSN మూర్తి (ప్రొడ్యూసర్ గారు) తనను TFJA సభ్యుడిగా పేర్కొంటూ, అసోసియేషన్ తరఫున వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతను మా సంఘానికి సభ్యుడు కాదని స్పష్టంగా తెలియజేస్తున్నాము” అని పేర్కొన్నారు.
ఇటీవల ‘X’ వేదికలో జరిగిన కొన్ని పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలు జర్నలిస్టుల సమాజాన్ని ఇబ్బందులకు గురిచేశాయని TFJA తెలిపింది. సంఘానికి సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలను సంస్థ పేరుతో ప్రచారం చేయడం తగదని, ఇలాంటి చర్యలు వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది.
అలాగే, TFJA విధానాలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశమై చర్చించినట్లు కూడా వెల్లడించింది. ఈ ప్రకటనపై అధ్యక్షుడు వైజే రాంబాబు, జనరల్ సెక్రటరీ పి. రఘు, పొలిట్‌బ్యూరో కన్వీనర్ వి. లక్ష్మీనారాయణ సంతకాలు చేశారు.
సినీ జర్నలిస్టుల సంఘం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో ఇండస్ట్రీలో మరోసారి చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికలపై సంఘాల పేర్లు ఉపయోగించడం, అధికారిక ధృవీకరణ లేకుండా ప్రకటనలు చేయడం వంటి అంశాలపై కఠిన వైఖరి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు
