HomeAndhra PradeshUnion Budget 2026-27: యూనియన్ బడ్జెట్ ముఖ్యాంశాలు: మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకంపై మోదీ ప్రభుత్వ...

Union Budget 2026-27: యూనియన్ బడ్జెట్ ముఖ్యాంశాలు: మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకంపై మోదీ ప్రభుత్వ ఫోకస్

Union Budget 2026-27: మోదీ ప్రభుత్వ మూడో యూనియన్ బడ్జెట్‌ను (2026–27) ఆర్థిక మంత్రి ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ దేశ ఆర్థిక వృద్ధికి దీర్ఘకాల పునాది వేయాలనే లక్ష్యంతో రూపొందినదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి, భారీ మూలధన వ్యయం (Capital Expenditure), తయారీ రంగం బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది.

బడ్జెట్‌లో తీసుకొచ్చిన పలు విధాన నిర్ణయాల వల్ల ఒకవైపు వినియోగదారులకు, రోగులకు ఊరట లభిస్తే, మరోవైపు పన్ను అనుసరణను కట్టుదిట్టం చేస్తూ ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం గట్టి సంకల్పం చూపించింది.

మూలధన వ్యయం, ఆర్థిక క్రమశిక్షణ
ఈ బడ్జెట్‌లో రూ.12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్కు ప్రభుత్వం హామీ ఇవ్వడం విశేషం. రోడ్లు, రైల్వేలు, విద్యుత్, లాజిస్టిక్స్ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సెమీకండక్టర్లు, బయో-ఫార్మా, వ్యూహాత్మక తయారీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఆర్థిక లోటును క్రమంగా నియంత్రించే స్పష్టమైన ప్రణాళిక ఉండటం వల్ల మార్కెట్లలో దీర్ఘకాల విశ్వాసం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధరలపై ఊరట ఇచ్చిన రంగాలు
బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాలు, దిగుమతి డ్యూటీల్లో సడలింపుల ద్వారా పలు కీలక రంగాల్లో ధరలు తగ్గే అవకాశం ఉంది.
ప్రధానంగా:
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 రకాల ఔషధాలు
7 అరుదైన వ్యాధులకు మందులు, ప్రత్యేక వైద్య ఆహారం (FSMP)
లెదర్ ఉత్పత్తులు (ఫుట్‌వేర్)
టెక్స్‌టైల్ వస్త్రాలు
సీ ఫుడ్ ఉత్పత్తులు
బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్
సోలార్ గ్లాస్
కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్)
బయోగ్యాస్ మిశ్రమ సీఎన్‌జీ
విమాన తయారీకి అవసరమైన విడిభాగాలు
మైక్రోవేవ్ ఓవెన్లు
విదేశీ టూర్ ప్యాకేజీలు, ఫారిన్ ఎడ్యుకేషన్
ఇవి చౌక కావడం వల్ల వినియోగదారులు, పరిశ్రమలు రెండింటికీ లాభం చేకూరనుంది.

ఖరీదైనవి ఏవి?
ఇదే సమయంలో కొన్ని రంగాల్లో పన్నులు పెరగడం లేదా కట్టుదిట్టమైన నిబంధనలు రావడం వల్ల వ్యయాలు పెరగనున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి:
మద్యం, సిగరెట్లు
అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన భాగాలు
ఖనిజాలు, ఇనుప ధాతువు, బొగ్గు
ఆదాయపు పన్ను మిస్‌రిపోర్టింగ్‌పై జరిమానాలు
స్టాక్ ఆప్షన్లు, ఫ్యూచర్స్ & ట్రేడింగ్ కార్యకలాపాలు
క్యాపిటల్ మార్కెట్లలో షేర్ బైబ్యాక్ పన్ను, STT, TCS మార్పుల వల్ల తాత్కాలికంగా ట్రేడింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పన్ను ఎస్కేప్‌ను అడ్డుకోవడం, పారదర్శకత పెంచడమే ఈ చర్యల ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు.

టూరిజానికి భారీ బూస్ట్
ఈ బడ్జెట్‌లో పర్యాటక రంగానికి విశేష ప్రాధాన్యం లభించింది.
హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ–కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సాహసయాత్రలు, పర్వత పర్యాటకాన్ని పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి చేయనున్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, తమిళనాడులోని పొతోగై మలై వంటి తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఎకో–టూరిజం ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. స్థానిక ప్రకృతి సంపద పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు సాగనున్నాయి.

సాంస్కృతిక పర్యాటకాభివృద్ధి
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో 15 పురావస్తు ప్రదేశాలను అగ్రశ్రేణి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. లోథాల్, సారనాథ్, హస్తినాపూర్ వంటి చారిత్రక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. దీని ద్వారా పర్యాటకం, ఉపాధి రెండూ పెరగనున్నాయి.

వైద్య పర్యాటకంపై ప్రత్యేక దృష్టి
భారతదేశాన్ని ప్రపంచస్థాయి వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆధునిక ఆసుపత్రులు, ఆయుష్ చికిత్సలు, పునరావాస సేవలను ఒకే చోట అందించే సమగ్ర ఆరోగ్య సముదాయాలుగా ఇవి అభివృద్ధి చెందనున్నాయి.

ఓవరాల్‌గా…
మొత్తంగా చూస్తే, 2026–27 యూనియన్ బడ్జెట్ తక్షణ లాభాలకంటే దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడుల పెంపు, ఉపాధి సృష్టి లక్ష్యంగా రూపొందింది. మౌలిక వసతులు, తయారీ, పర్యాటకం, వైద్య రంగాలపై పెట్టిన ఫోకస్ భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: Union Budget 2026 : చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం.. కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రసంగంలో కీలక ప్రకటనలు
Budget 2026 : ఫిబ్రవరి 1న మోదీ 3.0 బడ్జెట్.. రైతులకు సాయం రూ.10వేలకు పెంపు? ఉద్యోగులు, మధ్యతరగతికి కీలక ప్రకటనలపై అంచనాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు