HomeAndhra PradeshAndhra Pradesh GST : రికార్డు స్థాయి జీఎస్‌టీ వసూళ్లు… దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో...

Andhra Pradesh GST : రికార్డు స్థాయి జీఎస్‌టీ వసూళ్లు… దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh GST : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్ను వసూళ్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జనవరి 2026 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు రూ. 3,073 కోట్లకు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 6.72 శాతం పెరగడం విశేషం. 2017లో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జనవరి నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని పన్నుల శాఖ స్పష్టం చేసింది.

పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ. బాబు వెల్లండి వివరాల ప్రకారం, జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, వినియోగంలో పెరుగుదల, పన్ను ఎగవేతలపై కఠిన చర్యలే ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నిత్యావసరాలు, మందులు, వాహనాలు, సిమెంట్ వంటి కీలక వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, మొత్తం వసూళ్లు పెరగడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిదర్శనంగా అధికారులు పేర్కొన్నారు.

జాతీయ సగటును మించిన వృద్ధి
దేశవ్యాప్తంగా జనవరి నెలలో జీఎస్‌టీ వృద్ధి రేటు 5.80 శాతంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిని మించి ప్రదర్శన కనబరిచింది. దక్షిణాది రాష్ట్రాల సరసన కర్ణాటక తర్వాత రెండో స్థానంలో నిలిచి, కేరళ, తమిళనాడు, తెలంగాణలను వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది. ముఖ్యంగా ఈ వృద్ధి ఒక్క నెలకే పరిమితం కాకుండా గత పది నెలలుగా వరుసగా ఆదాయం పెరుగుతూనే ఉండటం గమనార్హం.

విభాగాల వారీగా ఆదాయ వృద్ధి
రాష్ట్ర జీఎస్‌టీ (SGST) వసూళ్లు రూ. 1,284 కోట్లకు చేరగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 8.37 శాతం ఎక్కువ. పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా రూ. 1,490 కోట్ల ఆదాయం సమకూరింది. అదే సమయంలో వృత్తి పన్ను (Professional Tax) వసూళ్లు ఏకంగా 25.60 శాతం పెరిగి రూ. 38 కోట్లకు చేరడం విశేషం.

కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్‌టీ (IGST) నిధుల విషయంలోనూ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది. జనవరి నెలలో రూ. 1,789 కోట్ల ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ సాధించినట్లు అధికారులు వెల్లడించారు. తప్పుడు క్లెయిమ్‌లను గుర్తించడం, పెండింగ్ అడ్డంకులను తొలగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.

ఏఐ, డేటా అనలిటిక్స్‌తో పన్ను ఎగవేతలకు చెక్
పన్ను ఎగవేతలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. ఏఐ (AI), డేటా అనలిటిక్స్ ఆధారంగా తప్పుడు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్‌లను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. పన్నులు చెల్లించని వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, అధికారుల పనితీరును నిరంతరం సమీక్షించి ప్రతిభ ఆధారంగా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత బలపడటమే కాకుండా, పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొన్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి: GST Collection: గతేడాది 2025 చివర్లో జీఎస్టీ ఆదాయం ఎంతో తెలుసా? ఏ రాష్ట్రాల్లో భారీ వృద్ధి అంటే!
AP Assembly : తొలిరోజు అసెంబ్లీ.. జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తూ తీర్మానం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు