Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత విస్తృతం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తూ అర్హులైన పేదలకు కొత్త ఇళ్లను మంజూరు చేస్తోంది. నిర్మాణ పురోగతిని బట్టి ప్రతీవారం లబ్దిదారులకు నిధులు విడుదల చేస్తూ పనులను వేగవంతం చేస్తోంది.
ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల మంజూరు కొనసాగుతుండగా… త్వరలో పట్టణాల్లో స్థలం లేని పేదలకు కూడా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక అప్డేట్ ఇచ్చారు.
పట్టణ పేదలకు ఉచితంగా స్థలం, ఇల్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పట్టణాల్లో నివసించే పేదలకు ఉచితంగా ఇంటి స్థలం కేటాయించి, అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులను అందిస్తుందని తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు.
మూడు నెలల్లో లక్ష ఇళ్ల గృహప్రవేశాలు లక్ష్యం
జనవరి 26న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో రైతులకు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీ కింద అందజేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా…
రాబోయే మూడు నెలల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.
మిగతా ఇళ్ల నిర్మాణాలు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని, వీలైనంత త్వరగా వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
72 గజాల స్థలం కేటాయింపు
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు ఉచితంగా 72 గజాల స్థలం కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆ స్థలంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు అప్పగించనున్నారు.
పట్టణాల్లో చాలామందికి సొంత స్థలం లేకపోవడంతో ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో ఉన్నారని వెల్లడించారు.
రైతులకు సబ్సిడీ, బోనస్ శుభవార్త
ఇదే కార్యక్రమంలో మంత్రి రైతులకు కూడా పలు శుభవార్తలు తెలిపారు.
వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై సబ్సిడీ అందిస్తున్నామని, దీనివల్ల రైతులపై భారం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉందని, రైతులు దీనిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఇటీవల సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించినట్లు వెల్లడించారు. అలాగే రైతు భరోసా పథకం నిధులు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పేదల ఇళ్లు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Telangana: అన్నదాతలకు తీపికబురు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘విద్యుత్ అంబులెన్స్‌లు’
Rythu Bharosa: తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
