Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల నడుమ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక భేటీ తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచింది.
లోక్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నలుగురు మంత్రులు ఒకే కారులో ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం నివాసంలో జరిగిన భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎందుకింత ప్రాధాన్యం?
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీపై ఆసక్తి పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి.
సింగరేణి టెండర్ల వ్యవహారంపై వారం రోజులుగా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం
ఒకటి రెండు రోజుల్లో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను కలవబోతుండటం
ఈ కీలక అంశాల నేపథ్యంలో మంత్రుల సమావేశం జరిగిందనే వార్త రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో అకస్మాత్తుగా నలుగురు మంత్రులు భేటీ కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఏయే అంశాలపై చర్చించారు? ఇది కేవలం పరిపాలనా సమావేశమేనా? లేక రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగిందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
టీపీసీసీ చీఫ్ స్పందన
ఈ భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో పాలనాపరమైన అంశాలపై మంత్రులు సమావేశమైతే తప్పేముంది?” అంటూ స్పష్టం చేశారు. దీనికి రాజకీయ రంగు అద్దాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
‘డిన్నర్‌కే వచ్చాం’ అంటూ మంత్రుల వివరణ
ఇదిలావుంటే ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంపై ఆయా మంత్రులు కూడా స్పందించారు.
“డిన్నర్ కోసమే కలిశాం. ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు” అని వారు ఆఫ్ ది రికార్డ్‌గా తెలిపారు.
సడెన్‌గా భేటీ జరిగినప్పటికీ, ఇది సాధారణ సమావేశమేనని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.
చర్చకు ఫుల్‌స్టాప్?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటం, అదే సమయంలో తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటుండటంతో ఈ భేటీకి మొదట పెద్ద ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో ఈ అంశంపై చర్చకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయినా… రాబోయే రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్లు, సింగరేణి టెండర్ల వివాదం, కోల్ బ్లాక్ అంశాలు రాజకీయ వేడి మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Lokesh with Revanth : దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి లోకేష్.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై కీలక చర్చ
Hyderabad : హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్దాం: రేవంత్ రెడ్డి
