HomeAndhra PradeshPawan Kalyan : తీర ప్రాంత అడవుల రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు.. గ్రేట్ గ్రీన్ వాల్,...

Pawan Kalyan : తీర ప్రాంత అడవుల రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు.. గ్రేట్ గ్రీన్ వాల్, 50% గ్రీన్ కవర్ లక్ష్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అడవుల రక్షణకు, ఆక్రమణల నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని, జనవరి నెలాఖరులోపు సమగ్ర రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

మంగళవారం వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్‌లోని క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “భారతదేశంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సుమారు 974 కిలోమీటర్ల తీరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడమే కాదు, రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని తెలిపారు.

తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల గ్రీన్ బెల్ట్
తీర ప్రాంతం మొత్తం వెంబడి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఈ పరిధిలో మడ అడవులు, సరుగుడు, తాటి వంటి స్థానిక మొక్కలను పెంచి తుపానులు, సముద్రపు అలల ప్రభావం నుంచి తీర ప్రాంత ఆవాసాలకు రక్షణ కల్పించాలన్నారు. ఇప్పటికే 402 కిలోమీటర్ల మేరకు 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడుతోందని గుర్తు చేశారు.

మూడు దశల్లో గ్రేట్ గ్రీన్ వాల్
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని ఆదేశించారు.
మొదటి దశలో తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతమంతా మొక్కలు నాటాలి.
రెండో దశలో కాలువలు, రోడ్లు, డొంకల వెంబడి పచ్చదనం పెంచాలి.
మూడో దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు ఉపయోగపడే రీతిలో మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించాలి.

మిస్టీ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes), కాంపా, గ్రీన్ క్లైమేట్ ఫండ్, సీఎస్ఆర్, ఉపాధి హామీ నిధులను సమన్వయం చేస్తూ విస్తృతంగా చెట్ల నాటకం చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియలో స్థానిక సమాజాల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

50 శాతం గ్రీన్ కవర్ – ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యం
రాష్ట్రాన్ని 50 శాతం గ్రీన్ కవర్‌తో నింపడం ముఖ్యమంత్రి N.Chandrababu Naidu తనకు ప్రత్యేకంగా అప్పగించిన ప్రతిష్టాత్మక లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాల వారీగా అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, అటవీ, ఉద్యాన, నీటిపారుదల, గిరిజన సంక్షేమ, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం వారం లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి తప్పనిసరిగా కనిపించాలన్నారు.

నోటిఫై కాని మడ అడవుల రక్షణ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల మేర నోటిఫై కాని మడ అడవులు ఉన్నట్లు శాటిలైట్ ద్వారా గుర్తించినట్టు తెలిపారు. వీటిని కూడా నోటిఫై చేసి అటవీ శాఖకు అప్పగించే దిశగా చర్యలు చేపడుతున్నామని, అంతవరకు ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మడ అడవుల ప్రాముఖ్యతపై తీర ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ప్రొద్దుటూరు గ్రామీణ రహదారులకు రూ.10 కోట్లు
ఇదే సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఉప ముఖ్యమంత్రిని కలసి గ్రామీణ రహదారుల అభివృద్ధిపై వినతిపత్రం సమర్పించారు. సాస్కీ పథకం కింద ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.10 కోట్లు కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Pawan Kalyan : కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పవన్ కల్యాణ్
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తానంటున్న యంగ్ హీరోయిన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు