Diabetes Effects: డయాబెటిస్ ఉన్న చాలామందిలో కాళ్ల సమస్యలు నిశ్శబ్దంగా మొదలవుతున్నాయి. నొప్పి లేదు… మంట లేదు… కానీ లోపల మాత్రం నాడీ వ్యవస్థ క్రమంగా పనిచేయడం ఆపేస్తోంది. ఈ ప్రమాదకర పరిస్థితినే డయాబెటిక్ న్యూరోపతిగా వైద్యులు చెబుతున్నారు.
ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తించకపోతే, చిన్న గాయం కూడా తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో అది కాళ్లు కోల్పోయే స్థాయికి కూడా తీసుకెళ్తోంది. ముఖ్యంగా ఎక్కువ సంవత్సరాలుగా షుగర్ ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది.
పాదాల్లో స్పర్శ తగ్గిపోవడమే అసలు ప్రమాదం
డయాబెటిక్ న్యూరోపతి ప్రభావంతో పాదాల్లో స్పర్శ క్రమంగా తగ్గిపోతుంది. దీంతో కాలికి గాయం అయినా నొప్పి తెలియదు. రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో ఆ గాయం మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈలోపు ఇన్‌ఫెక్షన్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం పెరుగుతుంది.
పరిస్థితి చేయి దాటితే ప్రాణాలను కాపాడేందుకు కాలును తొలగించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్ కీలక సేవలు
ఈ తరహా ప్రమాదకర సమస్యలకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కీలక పరిష్కారంగా నిలుస్తోంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్లో మధుమేహ బాధితులకు పాద సంబంధిత సమస్యలకు సమగ్ర చికిత్స అందిస్తున్నారు.
ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు ఈ క్లినిక్‌ను ఆశ్రయిస్తుండగా, ఎక్కువగా 30 నుంచి 70 ఏళ్ల మధ్య వయసువారే చికిత్స పొందుతున్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది.
స్క్రీనింగ్ నుంచి ప్రత్యేక చెప్పుల వరకు పూర్తి చికిత్స
కాళ్లలో అల్సర్లు, పుండ్లు, మానని గాయాలతో వచ్చే రోగులకు ముందుగా పూర్తిస్థాయి స్క్రీనింగ్ నిర్వహిస్తారు. న్యూరోపతి ఉందా లేదా అన్నది నిర్ధారించిన తర్వాత పరిస్థితిని బట్టి చికిత్సలు ప్రారంభిస్తారు.
అంతేకాదు, మళ్లీ గాయాలు కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డయాబెటిక్ ఫుట్‌వేర్ (special footwear)ను కూడా రోగులకు అందిస్తున్నారు.
పేద రోగులకు పూర్తిగా ఉచిత సేవలు
ఈ సేవలు పేద మధుమేహ రోగులకు పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం. గత రెండేళ్లలో సుమారు 2,000 మంది డయాబెటిక్ న్యూరోపతి బాధితులకు చికిత్సలు అందించగా, వారిలో దాదాపు 200 మందికి ప్రత్యేక చెప్పులు పంపిణీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
వైద్యుల సూచనలు
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ తమ కాళ్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్న గాయం, రంగు మార్పు, వాపు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిని సంప్రదిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేస్తున్నారు.
టెలి కాల్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, సమయం వృథా కాకుండా చికిత్స పొందే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి: Diabetes Juices: 14 రోజులు ఇలా ట్రై చేయండి.. డయాబెటిస్ తగ్గుముఖం!
Vegetables : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని కూరగాయలు
Type 1 Diabetes: చైనా సరికొత్త ఆవిష్కరణ.. టైప్-1 డయాబెటిస్ కు విముక్తి
