HomeAndhra PradeshChandrababu Naidu : ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

Chandrababu Naidu : ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

Chandrababu Naidu : తెలుగు జాతి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఇకపై ఉద్యోగాలు చేసే వారిగానే కాకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

దావోస్ పర్యటన తొలి రోజు భాగంగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. యూరప్‌లోని 20 దేశాల నుంచి కుటుంబాలతో కలిసి వచ్చిన తెలుగు ప్రజలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి…
తాను తొలిసారి దావోస్‌కు వచ్చిన రోజుల్లో జ్యూరిచ్‌లో తెలుగు వారి ఉనికే కనిపించలేదని, కానీ ప్రస్తుతం విజయవాడ లేదా తిరుపతి వాతావరణాన్ని తలపించేలా తెలుగు జనసమూహం కనిపించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారని, 148 దేశాల్లో ఏపీ ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్నా తెలుగు సంప్రదాయాలను కాపాడుకుంటూ సంక్రాంతి వంటి పండుగలను ఘనంగా జరుపుకోవడం గర్వకారణమని సీఎం చెప్పారు.

ఎన్నార్టీల సహకారాన్ని మరవలేం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీల పాత్ర చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న విజ్ఞప్తికి స్పందించి ఎన్నార్టీలు క్షణం కూడా ఆలోచించకుండా రాష్ట్రానికి అండగా నిలిచారని గుర్తుచేశారు.

కూటమి విజయానికి పవన్ కళ్యాణ్, బీజేపీతో పాటు ఎన్నార్టీల సమన్వయం కీలకంగా మారిందని చెప్పారు. కేసులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ కూడా కొందరు ఎన్నార్టీలు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు.

పెట్టుబడులు – ఉద్యోగాలే లక్ష్యం

రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడం గర్వకారణమన్నారు.

గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఏపీని ఎంచుకున్నాయని, ఆర్సెలర్ మిట్టల్ రూ. లక్ష కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నట్లు తెలిపారు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్‌తో పాటు ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.

మొత్తంగా రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ఇవి కార్యరూపం దాలిస్తే 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు.

ఎన్నార్టీల కోసం రూ.50 కోట్ల కార్పస్ ఫండ్

విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.50 కోట్లతో ఎన్నార్టీ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు మద్దతు అందిస్తామని, “ఒన్ ఫ్యామిలీ – ఒన్ ఎంటర్‌ప్రెన్యూర్” విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే… ఒకరు ఉద్యోగం కొనసాగించగా, మరొకరు వ్యాపార రంగంలోకి రావాలని సూచించారు. ఏపీలో పరిశ్రమలు, వ్యాపారాలకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

విదేశీ విద్యకు ప్రభుత్వ గ్యారెంటీ

విదేశీ విద్య కోసం విద్యార్థులకు ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు అందిస్తామని సీఎం కీలక ప్రకటన చేశారు. 4 శాతం వడ్డీకే రుణాలు అందించి, ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్శిటీల్లో చదువుకునే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

తిరుపతిలో ఐఐటీ – ఐఐఎస్ఈఆర్ తరహా సమ్మిళిత రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘ఏపీ ఫస్ట్’ పేరుతో అతిపెద్ద పరిశోధనా వ్యవస్థను తీసుకువస్తామని చెప్పారు.

టెక్నాలజీదే భవిష్యత్

క్వాంటం, ఏఐ, డ్రోన్, స్పేస్ టెక్నాలజీలే భవిష్యత్తని పేర్కొన్న సీఎం, లిచెన్ స్టైన్ వంటి చిన్న దేశాలు కూడా టెక్నాలజీ ద్వారా సంపన్న దేశాలుగా ఎదిగాయని ఉదాహరణగా చెప్పారు.

డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం, వైద్యం, ప్రజాసేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏఐకు చిరునామా తెలుగు వారేనని వ్యాఖ్యానించారు.

ఉత్సాహంగా సాగిన డయాస్పోరా కార్యక్రమం

జ్యూరిచ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం అంతా ఉత్సాహంగా సాగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం ప్రసంగానికి స్పందించారు.

స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలకు సీఎం బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం తెలుగు కుటుంబాలను ఆత్మీయంగా పలకరించి, గోదావరి పుష్కరాలకు రావాలని ఆహ్వానించారు.

ఇవీ చదవండి: Chandrababu Naidu : రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో భేటీలు
Highways : హైవే నిర్మాణంలో భారత్‌కు ప్రపంచ గర్వకారణం.. అమరావతి–బెంగుళూరు కారిడార్‌కు ‘బీకేవీ’ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు