Amaravati : క్వాంటం టెక్నాలజీ – జీవ విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనంతో ప్రపంచ స్థాయిలో సరికొత్త పరిశోధనా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
ఈ లక్ష్యాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేలా ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’ని అమరావతి క్వాంటం వ్యాలీ పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంప్రదాయ కంప్యూటర్లతో సాధ్యం కాని సంక్లిష్ట పరిశోధనలను క్వాంటం టెక్నాలజీ సహాయంతో పరిష్కరించడమే ఈ బయో ఫౌండ్రీ ప్రధాన ఉద్దేశ్యం.
వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు బాట
క్వాంటం బయో ఫౌండ్రీ ద్వారా మొండి వ్యాధులకు చికిత్స అందించే సరికొత్త ఔషధాల అభివృద్ధి, ఎంజైమ్ ఇంజినీరింగ్, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఆధునిక వైద్య పరికరాల రూపకల్పన జరగనుంది. భవిష్యత్తులో బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేయనుంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో టీసీఎస్, ఐబీఎం, సీఎస్ఐఆర్, ఐఐటీ ఢిల్లీ, సీవీజే సెంటర్, సెంటెల్లా ఏఐ వంటి అగ్రస్థాయి టెక్నాలజీ, పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విదేశీ పెట్టుబడులు – హై వాల్యూ ఉద్యోగాలు
గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ స్థాపనతో రాష్ట్రానికి భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పరిశోధన ఆధారిత సంస్థలు, డీప్‌టెక్ కంపెనీలు అమరావతిని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీంతో హై–వాల్యూ ఉద్యోగాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నాయి.
తొమ్మిది నెలల్లో కార్యరూపం దాల్చిన క్వాంటం వ్యాలీ
మే 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లోనే అత్యాధునికమైన IBM 133-Qubit Quantum System Two అమరావతిలో ఏర్పాటు కానుంది.
దేశంలోనే తొలి క్వాంటం పాలసీని అమలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇప్పటివరకు 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ క్వాంటం ఎకోసిస్టమ్‌లో భాగస్వాములుగా మారాయి.
ఏప్రిల్ 26 నుంచి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ
భారతదేశపు తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
లక్ష మంది యువతకు క్వాంటం శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం యువతకు భవిష్యత్ టెక్నాలజీల్లో నైపుణ్యం పెంచే దిశగా భారీ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటివరకు లక్ష మందికి పైగా యువత క్వాంటం టెక్నాలజీలో శిక్షణ పొందుతున్నారు.
క్వాంటం హ్యాకథాన్లకు 137 కళాశాలల నుంచి 20 వేల మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. అంతేకాకుండా, క్వాంటం రంగంలో ప్రత్యేక శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నారు.
స్టార్టప్‌లకు అమరావతి హబ్
క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పనతో స్టార్టప్‌లకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్, బయోటెక్, డీప్‌టెక్ స్టార్టప్‌లకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుంది.
క్వాంటం టెక్నాలజీ–బయాలజీ సమ్మేళనంతో అమరావతి నుంచి ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయి ఆవిష్కరణలు వెలువడనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: Highways : హైవే నిర్మాణంలో భారత్‌కు ప్రపంచ గర్వకారణం.. అమరావతి–బెంగుళూరు కారిడార్‌కు ‘బీకేవీ’ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచన
Chandrababu Naidu : అమరావతి అన్‌స్టాపబుల్: సీఎం చంద్రబాబు
