Chandrababu Naidu : ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొస్తామని, విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందుతుందన్న ప్రాథమిక సత్యం తెలియని వారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
విజయవాడలో నిర్వహించిన సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా విస్తృతంగా ప్రసంగించారు. ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిద్ధార్థ అకాడమీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సిల్వర్, గోల్డెన్ జూబ్లీ వేడుకలకు రెండింటికీ హాజరవడం తనకు సంతోషంగా ఉందన్నారు.
విజయవాడను విద్యలవాడగా తీర్చిదిద్దిన సిద్ధార్థ అకాడమీ
క్రమశిక్షణ, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత సిద్ధార్థ అకాడమీదేనని సీఎం ప్రశంసించారు. విజయవాడ పేరు వినగానే చదువుల సరస్వతి కొలువైన ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు విజయవాడకు రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్, లాసెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే విజయవాడలో చదవాల్సిందేననే స్థాయికి ఈ నగరం ఎదిగిందన్నారు.
అగ్రిటెక్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం
సిద్ధార్థ అకాడమీ అగ్రిటెక్ కళాశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 1975లో పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం సుమారు 28 వేల మంది విద్యార్థులు, 4 వేల మంది టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది ఈ సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపారు.
ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, లా, ఫార్మసీ, డెంటల్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి బయటకు వెళ్లారని చెప్పారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సూచన మేరకు సిద్ధార్థ వైద్య కళాశాలను ప్రభుత్వానికి అప్పగించగా, ఆ తర్వాత దేశంలోనే తొలి మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటైందని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి
అమరావతిని ఆపేయాలనే కుట్రలు గతంలో జరిగినా, వాటిని ప్రజలు తిప్పికొట్టారని సీఎం అన్నారు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ, చెన్నై, విశాఖ వంటి నగరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.
అమరావతి ప్రజా రాజధాని అని, దీనిని ఎవరూ కదపలేరని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిసి దేశంలోనే ఉత్తమ నివాస ప్రాంతంగా మారుతాయని తెలిపారు. ఆరు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు కానుందని, రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లను ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి చేరుకుంటామని ప్రకటించారు.
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు
విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి కిలోమీటర్‌కు ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ, ఐదు కిలోమీటర్లకు హైస్కూల్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని వివరించారు. ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తున్నామని తెలిపారు.
సమగ్రాభివృద్ధే లక్ష్యం
విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు వస్తున్నాయని, టీసీఎస్ సహా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కర్నూలు జిల్లా ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు, ఏఐ ఆధారిత వైద్య సేవల ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ప్రధాని Narendra Modi సమర్థ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: Amaravati : అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం.. హైకోర్టు భవన నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం
Amaravati : అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు
