HomeAgricultureAndhra Pradesh : సర్కారు ప్రకటనలేమో ఘనం.. క్షేత్రస్థాయిలో రైతు కంట కన్నీరే!

Andhra Pradesh : సర్కారు ప్రకటనలేమో ఘనం.. క్షేత్రస్థాయిలో రైతు కంట కన్నీరే!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ప్రకటన లేమో ఆకాశాన్నంటే ఉన్నాయని, ఒక్క రైతునీ నష్ట పోనివ్వమంటూ ఆర్భాటాలే తప్ప క్షేత్ర స్థాయిలో ప్రతి రైతు కంట కన్నీరే కనిపిస్తోందని వ్యవసాయ రంగ నిపుణుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఉల్లితో మొదలైన సంక్షోభంలో మరో పంట ప్రత్తి కలిసిందన్నారు. పత్తి రైతుల అగచాట్లపై ఆయన విశ్లేషణ.

పంట పండించి అమ్ముదామంటే ఏ పంటకూ గిట్టుబాటు కాని ధరలు.. పంట పండించటానికి రోజుల తరబడి యూరియా కోసం పడిన వెతలు..లేదా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు కొన్న పరిస్థితి. గత సీజన్ మిర్చి రైతుల సంక్షోభంతో మొదలు, పొగాకు, మామిడి..ఈ సీజన్ ఉల్లి రైతుల నుండి..నెల్లూరు లో ధాన్యం రైతుల పరిస్థితి అదే..మరలా ప్రత్తి రైతుల పరిస్థితి.. మిర్చి తీవ్రంగా నష్ట పోయినా ఇప్పటి వరకూ వాళ్లకు అందించిన సాయం ఏమిటి???

పొగాకు మొత్తం కొంటాం రైతులకు పూర్తి న్యాయం చేస్తాం అన్నారు..ఈ రోజుకీ రైతులు ధర్నా చేస్తున్నారు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న నల్ల బెర్లి పుగాకు తగల బెడుతున్నారు..రైతుల దగ్గర నుండి ఎంత బర్లీ పొగాకు కొన్నారు, దానికి గాను రైతులకు ఎంత చెల్లించారు? ఇంకా ఎంత బాకీ ఉంది???

తోతాపురి మామిడి కిలోకు 8 రూ ఫ్యాక్టరీలు చెల్లిస్తాయి, 4 రూ ప్రభుత్వం చెల్లెస్తుంది అన్నారు..ప్రస్తుతం ఫ్యాక్టరీలు 5 నుండి 6 రూ ఇస్తామంటున్నాయి, రైతులకు చెల్లింపులు పూర్తి కాలేదు.. ప్రభుత్వం కేజికి 4 రూ లలో ఇంత వరకూ ఒక్క రూపాయి చెల్లించ లేదు..ఇదిగో అదిగో అంటున్నారు.. ఎప్పటికి చెల్లిస్తారో తెలియదు.. మామిడి చరిత్ర లోనే టన్నుల కొలదీ మామిడి కాయలు రోడ్డు ప్రక్కన పార బొయ్యటం ప్రథమం..

ఇక ఉల్లి విషయంలో కిలో 12 రూ కొంటా మన్నారు, 4 రోజులకే మరల మార్కెట్ లో అమ్ముకోండి 12 రూ కంటే తక్కువ కు అమ్ముకున్న వాళ్లకు ఆ డిఫరెన్స్ డబ్బులు చెల్లెస్తా మన్నారు.. మరల ఇప్పుడు మీరు ఎక్కడైనా అమ్ము కోండి హెక్టర్ కి 50,000 రూ చెల్లెస్తామని అంటున్నారు.. గౌ. వ్యవసాయ మంత్రి ప్రకటన ఉల్లి 45,000 ఎకరాలలో సాగు జరిగింది. షుమారుగా 100 కోట్లు అవుతుంది అని ప్రకటించారు.

కానీ వాస్తవంగా జరిగిన సాగు..
కర్నూలు 45,200 ఎకరాలు
కడప 11,600 ఎకరాలు
నంద్యాల 7,875 ఎకరాలు
అనంతపురం 630 ఎకరాలు
ఇతర జిల్లాలు 500 ఎకరాలు
అంటే మొత్తం సాగు 65,805 ఎకరాలు

ఈ ఖరీఫ్ లో ఉల్లి ఎక్కడ సాగు చేసినా తీవ్రంగా నష్ట పోయారు.ఉల్లి రాయలసీమ లో ఎక్కడ పండించినా అమ్మకానికి కర్నూలు మార్కెట్ యార్డ్ కి రావలసిందే..కొద్దిగా తాడేపల్లి గూడెం మార్కెట్ కు వస్తుంది.. రాష్ట్రంలో 65,800 ఎకరాలలో ఉల్లి సాగు జరిగితే సాయం 45,000 ఎకరాలకి అని ఎలా ప్రకటించారు? ఈ 45,000 ఎకరాలు అనే అంచనా ఎలా వచ్చింది.రాయలసీమ లోని సరిహద్దు 3 జిల్లాలలో కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలలోనే ఎక్కువ సాగు జరిగింది..*మొత్తం సాగుపై అధికార యంత్రాంగం వెంటనే ప్రకటన చెయ్యాలి.

ఉల్లి రైతులు గత 50 సంవత్సరాలలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న 4 సంవత్సరాలలో ఈ సంవత్సరం ఒకటని రాయలసీమ లోని పెద్దలు చెబుతున్నారు. ఉల్లి పంటను సాగు చేసేది భార్య..భర్త కలిసి పొలం లో పని చేసుకునే చిన్న చిన్న రైతులు, కవులు రైతులు మాత్రమే..

పంట సాగు చేసిన 30 రోజుల లోపు e క్రాప్ జరగాలి..పంట తీసేసి మార్కెట్ కి వెళ్ళిపోయినా ఇంకా e క్రాప్ పూర్తి కాలేదు..దీని మూలంగా నిజమైన సాగు చేసిన చిన్న చిన్న రైతులకు అన్యాయం జరుగుతుంది..అలా జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉంది..ఉల్లి ఎకరానికి సరాసరి 7 నుండి 8 టన్నులు దిగుబడి వచ్చింది..

పంటకు పెట్టిన పెట్టుబడి కాకుండా.. ఇప్పుడు పంట హార్వెస్ట్ చెయ్యటానికి, ట్రక్ కిరాయి, హమాలీ ఛార్జిలు, మార్కెట్ లో కమీషన్ 2% డబ్బు చెల్లించటానికి, పంటకు ధర లేని పరిస్థితిలో అప్పు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నామని తీవ్ర ఆవేదన చెందు తున్నారు..
ప్రభుత్వం ప్రకటించిన సహాయం ఉల్లి రైతులు నష్ట పోతున్న దానితో చూస్తే చాలా స్వల్పం. ఇది ఏమాత్రం కూడా వాళ్ళని సంక్షోభం నుండి బయట పడెయ్యదు.. *అది కూడా ఎప్పటికి చెల్లిస్తారు?

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి వర్ణనా తీతం.. ప్రభుత్వ కనీస మద్దత్తు ధర పుట్టికి 19720 రూ. సరాసరిన MTU 1010(మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం రకం) అయితే 5 వేల నుండి 6 వేలు మద్దత్తు ధర కంటే తక్కువకు KNM (కొనారం వ్యవసాయ పరిశోధనా స్థానం, కరీమ్ నగర్ జిల్లా) రకాలైతే పుట్టికి 4 వేలకు పైగా తక్కువకు అమ్ముకుంటున్నారు..
ఎకరానికి 3 పుట్లు సరాసరి దిగుబడి.. రైతులు ఎకరానికి 12 వేలకు పైగా* వాళ్లకు ధర్మం బద్దంగా రావలసిన డబ్బు నష్ట పోతున్నారు..జిల్లాలో వరి రైతులు ఈ పంట లోనే షుమారు *250 కోట్లు పైగా నష్ట పోతారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు..

సజ్జ రైతులు క్వింటాలు *800 రూ* కనీస మద్దత్తు ధర కంటే తక్కువ కు అమ్ముకుంటున్నారు. ప్రత్తి రైతుల పరిస్థితి సంక్షోభం లోనికి వెళుతున్నది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ లో జరగవలసిన సాధారణ సాగు 13.05 లక్షల ఎకరాలు అయితే సాగు జరిగినది 10.62 లక్షల ఎకరాలు.. ఇందులో *కర్నూలు జిల్లాలోనే సాగు జరిగినది 5.54 లక్షల ఎకరాలు 52%. సీజన్ తొలకరిలో కర్నూలు జిల్లాలో వర్ష పాతం అనుకూలంగా ఉండటంతో 107% ప్రత్తి సాగు జరిగినది.. ఆగస్టు 8 నుండి కురిసిన అధిక వర్షాలకు మొదటి డొలుపు పూత, పింద దెబ్బ తిన్నది..ఇప్పుడు మరలా రెండు రోజుల నుండి కర్నూలు జిల్లాలోని అధిక వర్షాలకు మరలా అదే పరిస్థితి..

ఈ రోజుకు రాష్ట్రం లో ఎక్సెస్ వర్షం కురిసిన జిల్లా లు 4 అయితే అందులో కర్నూలు జిల్లా ప్లస్ 28% అధిక వర్షం నమోదైనది..
ఈ పరిస్థితిలో ప్రత్తికి ప్రధాన మార్కెట్ అయిన ఆదోని మార్కెట్ యార్డ్ కు షుమారు గా 6 నుండి 8 వేల క్వింటాళ్ళు ప్రత్తి వస్తున్నట్లు తెలుస్తున్నది..

పొడుగు పింజ ప్రత్తి ప్రభుత్వ కనీస మద్దత్తు ధర క్వింటలు 8110 రూ.
ప్రస్తుతం మార్కెట్ యార్డ్ లో అమ్ముతున్న ధర.. కనిష్ఠ ధర 3960 రూ. గరిష్ట ధర 7352 రూ.
CCI సెంటర్ లు అక్టోబర్ 1 నుండి తెరుస్తారని ప్రకటించారు, కానీ 1 వ తారీకుకు తెరిసే అవకాశం లేదని తెలుస్తోంది..
రాష్ట్రంలో రెండవ అత్యధిక సాగు జరిగిన ప్రత్తి ఉత్పత్తి దెబ్బ తిని కనీస మద్దత్తు ధర లభించక రైతులు తీవ్రంగా నష్ట పోతున్న పంటలలో *మరో పంట ప్రత్తి కూడా తోడైనది..

ఎప్పుడైనా ఒక సీజన్ లో ఒకటో రెండో పంటల అమ్మకం లో సమస్యలు వస్తాయి.. కానీ ఈ సీజన్ లో మొట్టమొదటి గా మార్కెట్ కు వచ్చే ఉల్లి తీవ్ర సంక్షోభం తో మొదలై.. అరటి, చినీ, సజ్జ, ధాన్యం, ప్రత్తి.. ప్రతి రైతూ సంక్షోభమే. ప్రభుత్వం ప్రకటనలే తప్ప..ఇంత వరకూ ఏ పంటకైనా రైతుకు చేరిన సాయం సున్నా.

ఇక యూరియా సంక్షోభం చెప్పనలవికాదు.. ఇంతటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదు.. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టి రైతు కు అవసరం అయిన యూరియా అవసరం అయిన సమయం లోనే అందించాలని మేజిస్టీరియల్ అధికారాలు ఉన్న రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి ప్రజాస్వామ్యయుతంగా వినతి పత్రం ఇవ్వడానికి అన్నదాత పోరు పేరుతో పిలుపు ఇస్తే పోలీస్ వ్యవస్థ ద్వారా కార్యక్రమం ను అడ్డుకునే పరిస్థితి.. ఇది ఏమీ బందుకు పిలుపు ఇవ్వలా, రాస్తా రోకో పిలుపు ఇవ్వలా, ఆఫీసుల ముట్టడి పిలుపు ఇవ్వలా.. కేవలం వినతి పత్రం సమర్పణకే ఆంక్షలు..

ఇక పంటల పూర్తి మార్కెటింగ్ మొదలయితే ఎలా ఉంటుందో..ఆలోచిస్తే చాలా ఆందోళన కలుగుతున్నది. ప్రభుత్వ యంత్రాంగం ప్రకటనలకే పరిమితం గాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితుల కనుగుణంగా అలోచించక పోతే రైతాంగం చాలా ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం చిత్త శుద్ధితో ఆలోచన చెయ్యవలసిన అవసరాన్ని ముందు గానే తెలియ జేస్తున్నాం..

– ఎంవీఎస్ నాగిరెడ్డి, M.Sc.,
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం మరియు రైతు సంక్షేమం),
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24).

ఇవీ చదవండి: Paddy : వరి రైతుకు గిట్టుబాటు ధర ఏదీ? నెల్లూరు, సీమ రైతుల అగచాట్లు
Tomato Price : టమాటా ధరలు పతనమైనప్పుడు రైతులకు ఊరట కలిగించే చర్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు