Paddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పంట ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మాత్రమే మాసూలు జరుగుతున్న వరి ప్రభుత్వ మద్దతు ధర పుట్టి (850 కేజీలు) రూ.19,720 అయితే MTU 1010 (మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా పరిశోధనా స్థానం) రకం పుట్టి రూ.14,000 లోపు, KNM (కోనారం, కరీంనగర్ జిల్లా పరిశోధనా స్థానం) రకాలు పుట్టి రూ.16,000కు రైతులు అమ్ముకుంటున్న దుస్థితి నెలకొంది.
సహజంగా ఎప్పుడైనా సీజన్ లో ఒక పంట లేక రెండు పంటల ధర మద్దతు ధర కంటే మార్కెట్ లో తక్కువ ఉంటే ప్రభుత్వం ఇంటర్ వీన్ అయ్యి మార్క్ ఫెడ్ ద్వారా మద్దత్తు ధరకు కొనుగోలు చేస్తుంది. ధాన్యం విషయం అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తుంది.
ఈ సీజన్ లో ఇదెక్కడి పరిస్థితో అనేక జిల్లాలలో అనేక పంటల అమ్మకం ధరలు కుప్ప కూలి పోయి రాయలసీమ రైతాంగ సంఘర్షణకు తోడు.. నెల్లూరు జిల్లా వరి రైతుల పరిస్థితి కూడా అలానే ఉన్నది.
ఈ సీజన్ లో నెల్లూరు జిల్లాలో వరి సాగు జరిగినది 1.97 లక్షల ఎకరాలు. ఎకరానికి సరాసరి దిగుబడి 3 పుట్లు వస్తే జిల్లాలో ధాన్యం ఉత్పత్తి 5.91 లక్షల పుట్లు (5.02 లక్షల టన్నులు) షుమారుగా KNM రకానికి పుట్టికి రూ.3,500 MTU 1010 రకానికి పుట్టికి రూ.5,500, రైతులు కనీస మద్దతు ధరలో నష్టపోతున్నారు. సుమారుగా ఎకరానికి రూ.12 వేలు. సుమారుగా 240 నుండి రూ.250 కోట్లు తమకు చట్ట బద్దంగా రావలసిన డబ్బు నెల్లూరు జిల్లా వరి రైతులు ఈ ఒక్క పంట లోనే నష్ట పోతున్నారు.
స్వామి నాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం C 2(Comprehensive Cost)+50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తే క్వింటాలుకు కనీసం రూ.4,000 పైన రావాలి. కానీ ఈ పంటకు 2024-25 మద్దతు ధర క్వింటాలుకు రూ.2,320.
నెల్లూరు జిల్లాలో ఈ పంటకు 2025-26 ధర వర్తించదు..
ఆ ధర కూడా లేకుండా పుట్టికి రూ.3,500 నుండి రూ.5,500 వరకూ రకాన్ని బట్టి నష్టపోతున్నారు.
పెరుగుతున్న కూలి ధరలు, ఎరువుల ధరల ధరలు, పురుగు మందుల ధరల కనుగుణం గా మద్దతు ధరలు పెరగక పోవడం ఒక వైపు రైతుల కష్టాలకు కారణం అయితే మరో వైపు ఆ కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు సంక్షోభంలో నెట్టివేయబడుతున్నారు.
ఎవ్వరినీ మోసం చేయనిది, మోసం చేసే ఆలోచన కూడా లేనిది రైతు. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుని సక్రమంగా పంట పండి ఆ పంటకు సరిఅయిన ధర వస్తే చాలని కోరుకుంటాడు.
ప్రస్తుతం మన రాష్ట్రం లో 67 శాతం మంది రైతుల సరాసరి భూమి ఒక ఎకరం.. 19 శాతం మంది రైతుల సరాసరి భూమి 3.5 ఎకరాలు. వారి సాగు ఎక్కువ గా జరిగే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా ప్రాంతాలలో భూ కమతాలు చిన్నవి. వరి వ్యవసాయం లో 80% పైగా కవులు రైతులు.
వ్యవసాయ కార్మికులే కవులు రైతులు లేకపోతే ఒక ఎకరం సొంత భూమి ఉండి మరో 2 నుండి 4 ఎకరాలు సాగు చేసే కవులు రైతులు..
వీళ్లంతా ఆర్ధికంగా బలహీనులే. వ్యాపార పంటలలో కవులు క్యాష్ రూపేణా పంట సాగుకు ముందే చెల్లిస్తారు..ఇక్కడ ధర లేక నష్ట పోతే మొత్తం కవులు రైతులే నష్ట పోతారు. వరి సాగులో భూమి కవులు పంట పండిన తరువాత ధాన్యం రూపేణా చెల్లిస్తారు. ఇక్కడ అమ్మకం ధర పడిపోయి నష్ట పోతే భూమి సొంత దారుడు, సాగు దారుడు కూడా నష్ట పోతాడు..
సాగు నీటి వనరులు లేని మెట్ట ప్రాంతాల్లో వర్షా ధారం తో సాగు చేసే పంట సజ్జ వచ్చే సంవత్సరం కొత్త పంట వచ్చే వరకూ కూడా నిలవ ఉండే పంట. ఈ ఖరీఫ్ లో రాష్ట్రం మొత్తం ఉత్పత్తి షుమారు 37,000 టన్నులు.. కొద్ది ఉత్పత్తి, నిలవ ఉండే సజ్జ కనీస మద్దత్తు ధర కంటే సుమారు క్వింటాలు రూ.800 తక్కువకు అమ్ముకుంటున్నా చూస్తూ ఉరుకుంటున్నాం.
ఉల్లి, టమాటా రైతుల ఆవేదన వర్ణణాతీతం
కర్నూలు మార్కెట్ లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి తిరిగి అక్కడే వేలం పెడితే కిలో ఉల్లి 50 పైసలు.. వ్యాపారుల మాయాజాలం..హెడ్డింగ్ తో.. క్వింటాలు రూ.50 నుండి రూ.400 అదే ఉల్లి మార్కెట్ లో రూ.10 నుండి రూ.20 కర్నూలులోనే బయట 4 కిలోలు రూ.100 అమ్ముతున్నారని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది.
ప్రభుత్వ అమ్మకంలోనే వ్యాపారుల మాయాజాలం నిజమైతే రైతుల అమ్మకం లో పరిస్థితి ఊహించలేదు.
భూమిని సాగు చేసే రైతు దేశానికి ఆహార భద్రత నందిస్తూ తనకి మాత్రం పెట్టిన పెట్టు బడి కూడా రాక తన కుటుంబ కనీస అవసరాలు కూడా తీర్చలేక తీవ్ర మానసిక సంఘర్షణ కు గురి అవుతున్నాడు.
అందరికీ తెలిసే అనేక పంటలకు రైతులకు నష్టం జరుగుతున్నా, మీడియాలో వార్తలు వస్తున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేమా? అధికార యంత్రాంగం, మేధావి వర్గాలు సరి అయిన ఆలోచన తక్షణమే చెయ్యకపోతే వ్యవసాయ రంగం మనుగడే ప్రమాదంలో పడుతుంది.

– ఎంవీఎస్ నాగిరెడ్డి, MSC,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24),
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సభ్యుడు (2011-14).
ఇవీ చదవండి: Rayalaseema : రాయలసీమ రైతుపై ప్రమాద ఘంటికలు.. టమాటా ధర పతనం
Sajja : సజ్జ.. కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి
