Justice Lisa Gill: చట్టంతో విభేదించిన బాలలైనా, సంరక్షణ అవసరమైన చిన్నారులైనా వారిని నేరస్తులుగా కాకుండా బాలలుగానే చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ స్పష్టం చేశారు. పేదరికం, సామాజిక నిర్లక్ష్యం, ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది చిన్నారులు జువెనైల్ జస్టిస్ వ్యవస్థ పరిధిలోకి వస్తున్నారని పేర్కొన్నారు. బాలలే దేశానికి అత్యంత విలువైన మానవ వనరు, గొప్ప ఆస్తి అని చెప్పారు. దురదృష్టవశాత్తు కొందరు చిన్నారులకు బాల్యం అంటే ఏమిటో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జువెనైల్ జస్టిస్ (బాలల సంరక్షణ, రక్షణ) చట్టం–2015 అమలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సంప్రదింపుల సమావేశం–2026లో ఆమె ప్రసంగించారు. గత పదేళ్లలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ సమావేశం వేదిక కావాలని సూచించారు.
వ్యవస్థలో ఇంకా లోపాలు
జువెనైల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, బాలల సంరక్షణ సొసైటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, ప్రత్యేక జువెనైల్ పోలీసు యూనిట్లు, బాలల సంరక్షణ సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు వస్తున్నాయా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని జస్టిస్ లీసా గిల్ అన్నారు. చట్టంతో విభేదించిన బాలల సంఖ్య తగ్గిందా? సంరక్షణ అవసరమైన చిన్నారుల సంఖ్యలో మార్పు వచ్చిందా? వారి జీవితాలను పునర్నిర్మించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించగలిగామా? పరిశీలన గృహాలు, ప్రత్యేక గృహాలు, భద్రతా కేంద్రాల్లో వసతులు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలపై నిజాయతీగా సమీక్షించుకోవాలని కోరారు. వ్యవస్థలో ఇప్పటికీ మౌలిక వసతుల కొరత, సిబ్బంది లేమి, బాలల స్నేహపూర్వక విధానాల అమలులో అసమానతలు కనిపిస్తున్నాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో నిబంధనలను తప్పుగా అమలు చేయడంతోపాటు అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
డిజిటల్ ముప్పులను ఎదుర్కోవాలి
డిజిటల్ ప్రపంచం బాలల ముందు కొత్త సవాళ్లను నిలిపిందని ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ వేధింపులు, ఆన్‌లైన్‌లో బాలలపై లైంగిక దోపిడీ, నియంత్రణలేని డిజిటల్ కంటెంట్ చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని చెప్పారు. ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండలేమన్నారు. బాలలను రక్షించేందుకు చట్ట అమలు వ్యవస్థతోపాటు న్యాయ, మానసిక, భావోద్వేగ సహాయక వ్యవస్థలు వేగంగా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఒక్క విభాగం విఫలమైనా వ్యవస్థ కుప్పకూలుతుంది
బాలల సంరక్షణలో ఏ ఒక్క శాఖ ఒంటరిగా పనిచేసి విజయం సాధించలేదని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పోలీసు, మహిళా–శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖలతోపాటు న్యాయవ్యవస్థ, రాష్ట్ర–జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, పౌర సమాజ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విభాగం ఈ వ్యవస్థలో కీలకమైన చక్రం వంటిదని, వాటిలో ఒక్కటి సరిగా పనిచేయకపోయినా మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని హెచ్చరించారు.
మన దృక్పథం మారాలి
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భిక్ష అడిగే చిన్నారిని చూసినప్పుడు కొందరు డబ్బులు ఇచ్చి వెళ్లిపోతారని, మరికొందరు పట్టించుకోరని, ఇంకొందరు భిక్షాటన చేయవద్దంటూ ఉపదేశించి వెళ్లిపోతారని జస్టిస్ లీసా గిల్ చెప్పారు. కానీ ఆ చిన్నారి పరిస్థితిని మార్చేందుకు ఎంత మంది బాధ్యతతో ముందడుగు వేస్తున్నారో ఆలోచించుకోవాలని కోరారు. ఈ విషయంలో తాను కూడా చేయాల్సినంత చేయలేకపోయానని నిజాయతీగా అంగీకరిస్తున్నట్లు తెలిపారు. చట్టంతో విభేదించిన ఓ బాలుడితో మాట్లాడుతున్నప్పుడు ‘ఈ పిల్లవాడు చాలా తెలివైనవాడు.. జాగ్రత్త’ అంటూ సంస్థల సిబ్బంది హెచ్చరించడం సరైన దృక్పథం కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు బాలలేననే విషయాన్ని మరచిపోకూడదని స్పష్టం చేశారు.
చిన్న నేరాలకు కోర్టు వ్యవస్థకు దూరంగా ఉంచాలి
స్వల్ప నేరాలకు సంబంధించిన కేసుల్లో బాలలను సాధ్యమైనంత వరకు అధికారిక న్యాయస్థాన ప్రక్రియకు దూరంగా ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఇందుకోసం పటిష్టమైన ప్రత్యామ్నాయ కార్యక్రమాలు, కౌన్సెలింగ్, సామాజిక సేవ, మనస్తత్వ నిపుణుల సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మొదట బాలలు నేరాల వైపు వెళ్లకుండా నిరోధించడంపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే చట్టంతో విభేదించిన వారికి జీవితాన్ని పునర్నిర్మించుకునే అనుకూల వాతావరణం కల్పించాలని చెప్పారు. బాలల సమస్యలకు మూలమైన సామాజిక, ఆర్థిక కారణాలను కూడా పరిష్కరించాలని సూచించారు.
సమావేశం ఫలితాలివ్వాలి
ఈ సంప్రదింపుల సమావేశాన్ని కేవలం పూర్తి చేయాల్సిన అధికారిక కార్యక్రమంగా భావించవద్దని జస్టిస్ లీసా గిల్ కోరారు. చర్చలు స్పష్టంగా, నిర్మాణాత్మకంగా, ఫలితాల ఆధారంగా సాగాలన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సత్కారం అందుకున్న 21 మంది చిన్నారులు దేశంలోని ఇతర పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని, పరిమితులు మన ఆలోచనల్లోనే ఉంటాయని చిన్నారులకు సందేశమిచ్చారు. బాలల సంరక్షణ కోసం చేసే ప్రతి ప్రయత్నం దేశ భవిష్యత్‌పై పెట్టే అత్యంత కీలకమైన పెట్టుబడి అని జస్టిస్ లీసా గిల్ స్పష్టం చేశారు.
Read also: India Justice Report: 2020-24 మధ్య వినియోగదారుల సమస్యల పరిష్కారంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1
Justice Srinivas Reddy : జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై ట్రోల్స్.. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
