Sajja : వరుస ధరల పతనాలు కొనసాగుతున్న పరిస్థితిలో రాయలసీమ, మరో వెనుక బడిన జిల్లా ప్రకాశంలో పండే మరో పంట సజ్జ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు అమ్ముకుంటున్న దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై వ్యవసాయ రంగ నిపుణులు, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విశ్లేషణ.
సజ్జ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో జరగవలసిన సాధారణ సాగు 61,775 వేల ఎకరాలు. ఈ సంవత్సరం 10/9/2025 నాటికి జరిగిన సాగు 55,471 ఎకరాలు. సజ్జకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దత్తు ధర క్వింటాలుకు రూ.2775. ఇంత కంటే తక్కువ ధరకు మార్కెట్ లో అమ్మకం జరగకూడదు. కానీ ప్రస్తుతం వ్యాపారులు కొంటున్న ధర రూ.1800 నుండి రూ.2000 మాత్రమే.
మైనర్ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు) సాగు చేసేది నీటి వనరులు లేని వర్షాధార ప్రాంతాలు.. వర్షాలు సక్రమంగా కురిసి పంట సక్రమంగా పండి ప్రభుత్వ మద్దత్తు ధరకు అమ్ముకుంటేనే మిగిలేది అతి స్వల్పం.
సజ్జ తరువాత రాష్ట్రంలో చిరు ధన్యలలో సాగు జరిగేది రాగి. ఈ సీజన్ లో రాగి మొత్తం సాగు జరిగినది 44,478 ఎకరాలు అయితే వెనుక బడిన ఎజెన్సీ జిల్లా అల్లూరి సీతరామరాజు జిల్లాలోనే సాగు జరిగినది 36,093 ఎకరాలు. రాగులు కనీస మద్దత్తు ధర క్వింటాలు రూ.4886. మైనర్ మిల్లెట్స్ లో సజ్జకి, రాగికి మాత్రమే కనీస మద్దత్తు ధరలు ఉన్నాయి.
కేంద్రం ప్రకటిస్తున్న ధరలు గిట్టుబాటు ధరలు కాదు.. కనీస మద్దత్తు ధరలు. స్వామి నాథన్ కమీషన్ నివేదిక ప్రకారం C 2+50% (Comprehensice Cost+50%) సజ్జకి మద్దతు ధర ప్రకటించాలంటే కనీసం క్వింటాలు రూ.5000 అవుతుంది. చిరు ధాన్యాలు వాడటం ఆహారానికి చాలా మంచిది అని డాక్టర్లతో సహా అనేక మంది మాట్లాడుతున్నారు. కానీ పండించే రైతుకు లాభసాటిగా లేక పోతే ఎలా పండిస్తాడు?
చిరు ధాన్యాలకు మద్దతు ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునః సమీక్షించ వలసిన సమయంలో ఆ ప్రకటించిన కనీస మద్దత్తు ధర కూడా రాకుండా అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఉరుకుంటూ ఉంటే రైతు ప్రతినిధులుగా చాలా ఆవేదన కలుగుతున్నది.
ఏపీలో సజ్జ సాగు
కర్నూలు 14,258 ఎకరాలు
నంద్యాల 12,066 ఎకరాలు
అనంతపురం 8,389 ఎకరాలు
ప్రకాశం 7,210 ఎకరాలు
తిరుపతి 5,045 ఎకరాలు
నెల్లూరు 2,292 ఎకరాలు
కడప 2,008 ఎకరాలు
నీటి వనరులు లేని ప్రాంతాలలో పెద్దగా రసాయనిక ఎరువులు వాడకుండా పండించే మంచి సూక్ష్మ పోషకాహారాలు ఉన్న చిరు ధాన్యాల పంటలను ప్రోతహించ వలసిన సమయంలో కనీస మద్దతు ధరను కూడా రైతుకు అందించలేక పోవడం చాలా బాధాకరం.
10/9/2025 నాటికి అతి తక్కువ సాగు జరిగిన జిల్లాలు శ్రీ సత్య సాయి 42%, అన్నమయ్య 19%, కడప 35%, చిత్తూరు 24%, ప్రకాశం 53%.
సాగు సంక్షోభం, వరుస ధరల పతనాలతో రాయలసీమ రైతులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రకటనలకే పరిమితం గాకుండా.. ప్రభుత్వ యంత్రాంగం చిత్త శుద్ధితో రైతులను ఆదుకోకపోతే ప్రమాద కర పరిస్థితులు సంభవిస్తాయి.

– ఎంవీఎస్ నాగిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24).
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సభ్యుడు (2011-14).
ఇవీ చదవండి: Rayalaseema : రాయలసీమ రైతుపై ప్రమాద ఘంటికలు.. టమాటా ధర పతనం
Tomato Price : టమాటా ధరలు పతనమైనప్పుడు రైతులకు ఊరట కలిగించే చర్యలు
