Tirupati: తిరుపతి జిల్లా అభివృద్ధికి కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి “దిశా”నిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన తిరుపతి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. దిశ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, కో చైర్మన్ హోదాలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు పాల్గొన్నారు.
తిరుపతి ఎంపీ మాట్లాడుతూ దిశ సమావేశాల్ని అధికారులు తేలిగ్గా తీసుకోవద్దన్నారు. వచ్చే సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి భూసార పరీక్షల కోసం మంజూరు చేసే కార్డులు అందరికీ అందాయో, లేదో మరోసారి సరి చూసుకోవాలన్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, పంటల బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
రైతులకు సరైన సమయానికి విత్తనాలు అందించాలన్నారు. ఒకవేళ సమయానికి విత్తనాలు అందించకపోతే దిగుబడి తగ్గి రైతు నష్టపోయే ప్రమాదం వుందని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బందిని ఉపయోగించుకుని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే పంటల బీమాపై కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
పీఎం కిసాన్, పసల బీమా యోజనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులంటే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన కోరారు. ప్రధానంగా పది లక్షల టన్నుల నాణ్యమైన చెరకు అందుబాటులో ఉన్నప్పటికీ గాజులమండ్యం కో ఆపరేటివ్ చెరకు ఫ్యాక్టరీని మూసే ఉంచారని, ఆ సమస్యను పరిష్కరించాలనే రైతుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్‌ను ఎంపీ కోరారు. వచ్చే నెల ఐదారు తేదీల్లో చక్కెర ఫ్యాక్టరీ సమస్యను పరిఫ్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
గతంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరై, అనంతర కాలంలో శిథిలమైన ఇళ్లకు సంబంధించి నివేదిక అందించాలని ఎంపీ కోరారు. అలాగే ఇప్పటికే జగనన్న కాలనీల్లో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ఆయన కోరారు. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవణం, నాగలాపురం, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని తడ, సూళ్లూరుపేట మండలాల్లో రేషన్ బియ్యం అక్రమంగా పక్క రాష్ట్రాల్లోకి తరలిస్తున్నారని, దీనిపై దృష్టి సారించి, స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై దృష్టి సారించాలన్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో రాజకీయంగా , వ్యక్తిగత కక్షలతో రేషన్ డీలర్లను తొలగిస్తున్నారని, ఇలాంటివి అరికట్టాలని ఎంపీ కోరారు.
ఎంపీ నిధుల వినియోగంలో నిర్లక్ష్యాన్ని నివారించండి
ఎంపీ నిధుల వినియోగంలో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఎంపీ గురుమూర్తి అన్నారు. మంజూరైన పనుల అమల్లో సమస్య తలెత్తుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికి కేటాయించారో వారే ఆ పనుల్ని పూర్తి చేసేలా చూడాలన్నారు. అందుకు విరుద్ధంగా అధికారులు వారిని బెదిరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అర్హులైన పెన్షనర్లకి రాజకీయ దురుద్దేశాలతో పెన్షన్లు ఇవ్వకుండా వేధించడం నిరోధించాల్సిన బాధ్యత అధికారులపై వుందని గురుమూర్తి అన్నారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లని రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. అంగన్‌వాడీ స్కూల్స్ కోసం అవసరమైన చోట భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయులపై కూడా రాజకీయ వేధింపులు లేకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి పథకం (ఆర్వో సిస్టం) పని చేయడం లేదని , పరిశీలించి వాటిని పునరుద్ధరించాలని ఆయన కోరారు. అలాగే కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు లేకపోయినా బిల్లులు డ్రా చేసుకుంటున్నారని ఎంపీ అన్నారు. నాయుడుపేట బీసీ హాస్టల్‌లో కుళ్లిన కూరగాయలతో వంటలు చేశారని మీడియాలో వచ్చిన కథనాల్ని కలెక్టర్‌కు ఎంపీ చూపారు.
తిరుపతి నగరానికి సంబంధించి డ్రైనేజీని మెరుగుపరచాలని కమిషనర్ నాగమౌర్యను ఎంపీ కోరారు. కొత్తగా వాటర్ కనెక్షన్‌కు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని, దీన్ని అరికట్టాలని ఎంపీ కోరారు. వైద్య రంగానికి సంబంధించి పీహెచ్‌సీలలో ఆదివారాలు కూడా డాక్లర్లు అందుబాటులో వుండేలా చూడాలన్నారు. తీర ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుని, తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు.
ఇవీ చదవండి: Women: ఏపీలో మహిళలు, చిన్నారులపై దాడులు.. ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం!
CPM Baburao: తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ.. వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టండి
Oberoi Hotels in Andhra Pradesh: గంటికోటలో ఒబెరాయ్ హోటల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. తిరుపతి, విశాఖలోనూ నిర్మాణం
