Oberoi Hotels in Andhra Pradesh: ప్రఖ్యాత ఒబెరాయ్ హోటల్స్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రస్థానం ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్స్‌ను నిర్మించనుంది. ఇందులో భాగంగా నేడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పరిధిలోని గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. (Oberoi Hotels in Andhra Pradesh) ఆయనేమన్నారంటే..
“దేవుడి దయతో జమ్ములమడుగు నియోజకవర్గంలో మరో మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. ఈ రోజు ఒక్క వైఎస్సార్ కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గంలోనే కాకుండా విశాఖపట్నం, తిరుపతితో కలిపి మూడు చోట్ల కూడా శంకుస్ధాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా, జమ్ములమడుగు నియోజకవర్గంలో ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ప్రతిష్టాత్మకమైనది. మనం గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిల్చుకునే మన గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం.
ఇవాళ ఒబరాయ్ లాంటి గ్రూపు ఇక్కడకి వచ్చి, సూపర్ లగ్జరీ సెవన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోంది. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హోటల్స్ కడితే.. గండికోటని గ్లోబల్ టూరిజం మ్యాప్‌లోకి తీసుకొనిపోగలుగుతాం. ఇటు గండికోటతో పాటు అటు తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటల్స్ వస్తున్నాయి.
CM YS Jagan Flagged off the Speed Boats | Gandikota View Point pic.twitter.com/54HrRgojcR
— Rahul (@2024YCP) July 9, 2023
అంతర్జాతీయ మ్యాప్‌లో చోటు దక్కుతుంది…
ఈ ప్రాజెక్టు వల్ల కడప జిల్లా, గండికోట రెండూ అంతర్జాతీయ మ్యాప్‌లలో చోటు దక్కించుకుంటున్నాయి. కడప జిల్లాలో గతంలో ఇదే జమ్మలమడుగు నియోజకవర్గంలో.. స్టీల్ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నాం. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగఅవకాశాలు రావాలని దశాబ్దాలుగా కన్న కలను నిజం చేస్తూ… గతేడాది జిందాల్ గ్రూపుతో కలిసి.. ఆ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశాం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి.. వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు ఈ జూలైలో ఎన్విరానిమెంటల్ క్లియరెన్స్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కడుతున్న వేగం కన్నా యుద్ధప్రాతిపదికన అక్కడ కూడా పనులు రెట్టించిన వేగంతో జరుగుతాయి.
ఇక్కడ ఒబరాయ్ హోటల్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ హోటల్ వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఒబరాయ్ ప్రాజెక్టు అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక లంగరు వలె ఉపయోగపడుతుంది. ఈ గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉంది. కనీసం ఒబరాయ్ లాంటి ఇంకో గ్రూపుని తీసుకొచ్చే కార్యక్రమం కూడా ముమ్మరంగా చేస్తాం.
కాసేపటి క్రితం విక్రమ్ ఒబరాయ్ గారితో మాట్లాడుతూ.. ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ పెట్టే ఆలోచన చేస్తే.. హోటల్‌కు మంచిది. ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ హోటల్‌ను ఒక గోల్ఫ్ రిసార్ట్‌గా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పాను. ఆ దిశగా అడుగులు వేసేలా ఆలోచన చేస్తామని చెప్పారు.
డిక్సన్ ప్రారంభోత్సవం చేస్తున్నాం..
రేపు కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి సంబంధించి ప్రారంభోత్సవం చేస్తున్నాం. కొప్పర్తిలో డిక్సన్ గ్రూపు 1000పైగా ఉద్యోగాలు ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఛానల్ ప్లే అనే మరో కంపెనీ… హోం ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూ పై సంతకాలు చేయనున్నాం. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక రెండోది ఎల్‌ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే టెక్నో డామ్ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నాం. ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
కడప జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం, మంచి జరిగే రోజులు చాలా ఉన్నాయి. ఇవన్నీ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు, అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన విక్రమ్ ఒబరాయ్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ ప్రాజెక్టు రావడానికి శాయశక్తులా కృషి చేసిన చీప్ సెక్రటరీ నుంచి పర్యాటక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సహా ప్రతి ప్రభుత్వ అధికారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీ అందరి సహకారం ఈ ప్రాజెక్టుకు చాలా అవసరం. ఈ కంపనీ మన గురించి గొప్పగా బయట మాట్లాడితే.. ఇంకా నాలుగు కంపెనీలు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న అంశాలున్నా.. వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత సహకారం అందిస్తే మన జిల్లా ప్రతిష్ట పెరిగి.. అంత ఎక్కువ పరిశ్రమలు మన జిల్లాకు వచ్చి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెడతారు. ఇవన్నీ మీ తరపున నుంచి మీ సోదరునిగా మీ అందరికీ నా విజ్ఞప్తి.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.