Child Aadhar: బ్లూ ఆధార్ లేదా బాల ఆధార్.. చిన్నారులకు తీసుకొనే ఆధార్ కార్డును ఇలా పిలుస్తుంటారు. మన దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఆధార్ కార్డులో పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ 12 అంకెల సంఖ్యలో ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. ఇండియా పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలు, పొందాలంటే ఆధార్ అవసరం. ధ్రువీకరణ పత్రంగానూ ఇది వినియోగిస్తున్నారు. Child Aadhar
సాధారణంగా ఆధార్ కార్డులు తెలుపురంగులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. వయోజనులకు వీటిని జారీ చేస్తారు. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా? దీన్నే బాల ఆధార్‌గా పేర్కొంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా బ్లూ కలర్‌లో ఉండే ఆధార్ కార్డులను విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేస్తుంది. ఇంతకీ ఈ బాల ఆధార్ ఎలా తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్లూ ఆధార్ అనేది ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తారు. దీని కోసం పిల్లల బయోమెట్రిక్ వివరాలేవీ అవసరం లేదు. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు లాంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్‌తో ఆధార్‌ను మంజూరు చేస్తుంటారు. వీరి కార్డును తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేస్తారు.
బాల ఆధార్ కార్డు కాలపరిమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చేవరకే. తర్వాత వేలిముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్‌డేట్ చేసుకోవడంతో పాటు మళ్లీ 15 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఈ వివరాలతోనే మరోసారి అప్‌డేట్ చేసుకోవాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
ఎక్కడైనా ఆధార్ నమోదు కేంద్రానికి తల్లిదండ్రులు ఆధార్ కార్డు, చిరునామా, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఒక ఫొటో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్ నమోదు అప్లికేషన్ తీసుకొని పూర్తి చేయాలి. అందులో తల్లిదండ్రుల ఆధార్ వివరాలను కూడా పొందుపరచాలి. ఈ ఫారాన్ని ఉడాయ్ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొనే వీలుంది. తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌నే పిల్లల ఆధార్ కార్డుకూ అనుసంధానిస్తారు.
కచ్చితంగా నంబర్ కూడా ఫారంలోనే ఉండేలా చూసుకోవాలి. తర్వాత మీరిచ్చిన పత్రాలను సిబ్బంది ధ్రవీకరణ చేస్తారు. వెంటనే మొబైల్ నంబర్‌కు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది. అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ని తీసుకోవడం ఎవరూ మర్చిపోరాదు. అందులో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ కూడా ఇస్తారు. దీంతో మీ పిల్లల ఆధార్ కార్డు అప్లికేషన్ వివరాలను సులభంగా పొందే వీలుంటుంది. 60 రోజుల్లోపు మీ పిల్లల పేరుపై బాల ఆధార్ కార్డును ఇస్తారు. బ్లూ ఆధార్ కార్డు జారీ పూర్తిగా ఉచితంగానే పొందవచ్చు.
ఇవీ చదవండి: Address Change in Aadhar: ఆధార్‌లో చిరునామా మార్పు ఇక మరింత సులువు
Maha Lakshmi Scheme Telangana: మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన ధృవపత్రాలివే..
PM Kisan: నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ.. 14వ విడత సొమ్ము విడుదల
WhatsApp: ఆధార్, పాన్ కార్డు వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసేయండి!
