ఆధార్, పాన్ కార్డ్ లేనిదే చాలా పనులు జరగడం లేదు. వీటిని నిరంతరం మన జేబులోనో, పర్సులోనో ఉంచుకోవాల్సి వస్తోంది. కొందరు జేబులో బరువుగా భావించి సెల్ ఫోన్లోనో, మెయిల్‌లోనో ఉంచుకొని అవసరమైనప్పుడు ప్రింట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు డిజి లాకర్‌లో భద్రపరుచుకుంటూ ఉంటారు. అయితే, చాలా మంది అవసరమైనప్పుడు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం అందరి ఫోన్లో వాట్సాప్ (WhatsApp) ఉండాల్సిందే. మెసేజ్‌లు, వీడియో, ఆడియో కాల్స్ చేసుకొనేందుకు వాట్సప్‌ను (WhatsApp) వాడుతున్నారు.
1. ఆధార్, పాన్ లాంటి వాటిని ఇప్పుడు వాట్సప్‌లో (WhatsApp) కూడా డౌన్‌లోడ్ చేసుకొనే ఫీచర్ అందుబాటులో ఉంది.
2. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరమైనప్పుడు ఖంగారు పడాల్సిన పని లేకుండా వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
3. అయితే, ఇలాటి డాక్యుమెంట్లను తొలుత మీరు డిజి లాకర్‌లో సేవ్ చేసుకొని ఉండాలి.
4. అలా చేసుకొని ఉంటే వెంటనే వాట్సప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
5. ఇటీవల డిజిలాకర్ సేవలు వాట్సప్‌లో మొదలయ్యాయి. MyGov Helpdesk చాట్ బటన్ ద్వారా ఈ ప్రాసెస్ చాలా సులభంగా చేసుకోవచ్చు.
6. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో MyGov Helpdesk నంబర్ +91 9013151515 ను సేవ్ చేసుకోండి.
7. తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి MyGov Helpdesk నంబర్‌ను సెర్చ్ చేయండి. చాట్ బాక్స్ తెరిచి Hi లేదా Namaste అని మెసేజ్ పంపాలి.
8. అనంతరం డిజిలాకర్ సర్వీసు, కోవిన్ ఆన్ వాట్సప్ ఆప్షన్లు కనిపిస్తాయి.
9. డిజిలాకర్ అకౌంట్ పై క్లిక్ చేసి లింక్ అయిన ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
10. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి. తర్వాత మీ డాక్యుమెంట్లన్నీ కనిపిస్తాయి.
11. ఇందులో మీకు కావాల్సిన వాటిని ఎంచుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
దేశీయంగా డీలా పడిన స్మార్ట్ ఫోన్ మార్కెట్
దేశీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల (Smartphone market) సరఫరా భారీగా పడిపోయింది. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య దేశీయంగా స్మార్ట్ ఫోన్ల సరఫరా 27 శాతానికిపైగా తగ్గి 2.96 కోట్లకు పరిమితమైందని మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2021లో ఇదే త్రైమాసికంలో 4.06 కోట్ల స్మార్ట్ ఫోన్లు (Smartphone market) సరఫరా అయ్యాయని ఐడీసీ పేర్కొంది.
స్మార్ట్ ఫోన్ల సరఫరా భారీగా తగ్గగిపోవడానికి కారణం.. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లేనని ఐడీసీ వివరించింది. చిప్‌ల సరఫరా మెరుగుపడిందని, అయినప్పటికీ అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు పెరిగాయని తెలిపింది. అందుకే ఇప్పుడు గిరాకీ పడిపోయిందని వెల్లడించింది.
కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతులు, ఇంటి నుంచి పని పెరగడంతో అత్యధిక మంది కొత్త స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం పాఠశాలలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో స్మార్ట్ ఫోన్లను కొత్తగా కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలపైనే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉందని తేలింది. అందువల్లే అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు.
ద్రవ్యోల్బణ ప్రభావం అంతగా పడని సంపన్నులు కొనుగోలు చేసే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు పెరిగాయని, అందువల్లే తక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ల కొనుగోలు తగ్గిందని తేలింది. 25 వేల రూపాయలలోపు ధర ఫోన్ల సరఫరాలు 15 శాతం తగ్గినట్లు తేలింది. అయితే, 25 వేల నుంచి 41 వేల మధ్య ఫోన్ల సరఫరాలు మాత్రం 20 శాతం పెరిగాయని తేలింది. 41 వేల రూపాయల పైన ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు 55 శాతం రాణించడం విశేషం.
12 వేల 500 రూపాయల లోపు ధర స్మార్ట్‌ఫోన్లు సరఫరాలు 54 శాతం నుంచి 46 శాతానికి పరిమితమయ్యాయని ఐడీసీ వెల్లడించింది. ఈ విభాగంలో కొత్త ఫోన్లు రాకపోవడంతో వృద్ధి పరిమితమైందని పేర్కొంది. పెరుగుతున్న ధరలు, అదనపు నిల్వల కారణంగా 2023 ప్రథమార్ధం వరకు ఇబ్బందులు కనిపించొచ్చని తెలిపింది. కాగా, మార్కెట్ వాటా విషయంలో డిసెంబర్ త్రైమాసికంలో 18.6 శాతం, వార్షికంగా 21 శాతం వాటాతో షియోమీ అగ్రస్థానంలో ఉందని వెల్లడైంది.
Read Also : Sleeping Tips: నిద్రపట్టడానికి మంచి టిప్స్.. ఇలా ప్రయత్నించండి..