ST List AP: ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కులాలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని దశాబ్దాలుగా కోరుతున్నారు. ఈ డిమాండ్ ఇప్పుడు నెరవేరుతోంది. ఎస్టీ జాబితాలోకి మరిన్ని కులాలను చేరుస్తూ కేంద్ర న్యాయ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మరిన్ని కులాలకు ఎస్టీ హోదా దక్కనుంది. ఈ పరిణామం చారిత్రాత్మకమంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ST List AP
ఏపీలో కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు లైన్ క్లియర్ అయిపోయింది. ఈ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలు కల్పిస్తూ ఈనెల 6, 8వ తేదీల్లో రాజ్యసభ, లోక్‌సభలు పాస్‌చేసిన రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వుల (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించడంతో దానికి చట్టరూపం వచ్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏయే కులాలు చేర్చారంటే..
ఈ చట్టాన్ని అనుసరించి ఇప్పుడు రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వులు 1950లో ఎంట్రీ నంబర్ 25 కింద కొత్తగా పొర్జ, బోండో పొర్జ, ఖోండ్ పొర్జ, పరంగిపొర్జ కులాల పేర్లను చేర్చారు. అలాగే ఎంట్రీ నంబర్ 28లో సవరాస్, కాపు సవరాస్, మలియా సవరాస్, కొండ సవరాస్, ఖుట్టో సవరాస్ కులాలను చేర్చారు. ఈ కులాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ హోదా లభిస్తోంది.
ఏపీలో వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎప్పటి నుంచో కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ కులాలను కాకుండా తాజాగా 9 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. దీంతో వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పోరాటాన్ని ముమ్మరం చేయాలని ఈ వర్గాలకు చెందిన ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది.
ఇదీ చదవండి: GST council: ఎట్టకేలకు ఓ మీటింగ్‌కు హాజరైన తెలంగాణ ప్రభుత్వం.. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి హరీష్‌రావు
