GST council: ఉప్పూ నిప్పులా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎట్టకేలకు ఓ మీటింగ్‌లో కలిశాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు దాదాపు దూరంగా ఉంటూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాల్గొంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.. జీఎస్టీ మీటింగ్‌లో పాల్గొన్నారు. కొన్నాళ్లుగా ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ భేటీ అయితేనేమి.. ఆర్థిక శాఖ సమావేశాలైతేనేమి.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అయితేనేమి.. ఇలా ఏ సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినా వాటిని తెలంగాణ సర్కార్ అవాయిడ్ చేస్తూ వస్తోంది. (GST council)
దేశ రాజధాని న్యూఢిల్లీలోని విగ్యాన్ భవన్‌లో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) అధ్యక్షతన 50వ జీఎస్టీ కౌన్సిల్ (GST council Meeting) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ (Telangana State) రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి హరీష్‌రావు రాష్ట్ర సమస్యలను ఏకరువుపెట్టారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను వివరించారు.
తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ ఫండ్స్ (GST Funds) ఇతర రాష్ట్రాలకు చెల్లించిన అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు హరీష్ రావు. చాలా కాలంగా అడుగుతున్నా కొలిక్కిరాలేదని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రకు చెందిన ఒక ట్యాక్స్ పేయర్ రూ. 82 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది… ఇదే విషయాన్ని ఆ ట్యాక్స్ పేయర్ కూడా అంగీకరించారు… అయితే తనకు రీఫండ్ రాగానే చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చారరని మంత్రి హరీష్ రావు తెలిపారు. కానీ పెండింగ్‌లోనే ఉండిపోయిందని వివరించారు.
ఇక గతంలో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే దీన్ని లేవనెత్తామన్న హరీష్ రావు.. అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ కార్యరూపం దాల్చలేదని ఈ సందర్భంగా నిర్మలమ్మ దృష్టికి మంత్రి హరీష్ రావు తీసుకెళ్లారు. ఇప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలూ లేవని, అందువల్ల ఇలాంటి అంశాలను సత్వరం పరిష్కరించేందుకు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఆఫీసర్ల బృందాన్ని గానీ లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గానీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ ప్రతిపాదనపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించుకున్నట్లుగా అధికారులతో కూడిన కమిటీని వీలైనంత త్వరలోనే నియమిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై కేంద్రం వద్ద ప్రస్తావించారు. ఇది మంచి పరిణామమని, సమావేశాలకు హాజరై రాష్ట్రం తరఫున మాట్లాడితేనే అసలు విషయాలు తెలుస్తాయని, దూరంగా ఉంటే సమస్యలు మరింత జఠిలమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.