AP Local Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి. అధికార టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 27 పట్టణ స్థానిక సంస్థలకు మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్టోబర్ 15న కేంద్ర కార్యాలయం అధికారిక జాబితాను విడుదల చేసింది.
ఏడు కార్పొరేషన్లకు అభ్యర్థులు
విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కడప నగరపాలక సంస్థలకు వైసీపీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. విశాఖపట్నంలో వరుదు కల్యాణి, విజయనగరంలో కోలగట్ల శ్రావణి, ఏలూరులో గంటా మోహనరావు, మచిలీపట్నంలో లంక జ్యోతి అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఒంగోలులో కుప్పం ప్రసాద్, నెల్లూరులో ఆనం విజయకుమార్ రెడ్డి, కడపలో బండి దీప్తిరెడ్డిని పార్టీ ప్రకటించింది. కీలక నగరాల్లో ముందుగానే నాయకత్వాన్ని ఖరారు చేయడం ద్వారా ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేస్తోంది.
మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థుల ఖరారు
ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, నర్సీపట్నం, ఎలమంచిలి, తుని, కొవ్వూరు, రామచంద్రపురం, కొండపల్లి, తెనాలి, చీరాల, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల, మదనపల్లె మున్సిపాలిటీలకు చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా పులివెందులలో వైఎస్ ప్రమీలమ్మ, తెనాలిలో మద్దాలి శేషాచలం, కొండపల్లిలో నల్లమోతు తేజస్వి, నర్సీపట్నంలో చింతకాయల అనిత, మదనపల్లెలో జింకా చలపతిని ఎంపిక చేసింది.
నగర పంచాయతీల్లోనూ ఎన్నికల సన్నాహాలు
ఏలేశ్వరం, ఉయ్యూరు, గురజాల, కనిగిరి, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం నగర పంచాయతీలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు పార్టీ విడుదల చేసిన వివరాల్లో వెల్లడైంది.
కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు
మరోవైపు అధికార కూటమి పార్టీల మధ్య స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ విడుదల చేసినది మేయర్, చైర్పర్సన్ పదవులకు ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితా. వార్డులు, డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితా కాదు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపిక, కూటమి సీట్ల సర్దుబాటు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
List PDF here Press Release_Candidates final (27 ULBs)_15.10.2026
Read also: Local Body Elections 2026: స్థానిక పోరుకు నగారా.. కూటమిలో సీట్ల పంచాయితీ! జనసేనకు నాలుగు కార్పొరేషన్లేనా?
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్.. బీసీల 34 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!






