Tenali Crime: గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, తీవ్ర వాగ్వివాదం అనంతరం ఆమెను కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పదేళ్ల క్రితం వివాహం.. ఇద్దరు పిల్లలు
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామానికి చెందిన నరేంద్రబాబు, సంధ్యారాణి దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం కొంతకాలం క్రితం ఈ కుటుంబం తెనాలి మండలం అంగలకుదురుకు వచ్చి నివాసం ఉంటోంది. నరేంద్రబాబు తొలుత హోటల్‌లో పనిచేసేవాడు. తర్వాత పని సరిగా లేకపోవడంతో చిన్న బడ్డీ కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
అనుమానంతో మొదలైన విభేదాలు
భార్య ప్రవర్తనపై నరేంద్రబాబుకు అనుమానం రావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంధ్యారాణి కొంతకాలం తన పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఒప్పింపుతో, బతిమాలుకుని వారం రోజుల క్రితమే ఆమెను తిరిగి అంగలకుదురుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే దంపతుల మధ్య విభేదాలు మాత్రం కొనసాగినట్లు సమాచారం.
పిల్లలను స్కూల్‌కు పంపిన తర్వాత ఘర్షణ
శుక్రవారం ఉదయం పిల్లలిద్దరినీ స్కూల్‌కు పంపిన అనంతరం దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన నరేంద్రబాబు ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో సంధ్యారాణిపై పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితుడు ఆమె జుట్టును కూడా కోసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భర్త
భార్య మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత నరేంద్రబాబు ఇంటికి తాళం వేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ సభ్యుల ఆవేదన
వారం రోజుల క్రితమే సంధ్యారాణిని పుట్టింటి నుంచి కాపురానికి తీసుకెళ్లి ఇప్పుడు దారుణంగా హత్య చేయడంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, దంపతుల మధ్య ఉన్న విభేదాల స్వరూపం, ఇతర పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: Hyderabad Crime: టీవీ కార్యక్రమం పేరుతో మోసం.. సికింద్రాబాద్‌లో మహిళపై ఇద్దరి దారుణం
Nizamabad Crime: ప్రియుడితో కలిసి భర్త హత్య.. హార్పిక్‌ను సిరంజితో ఎక్కించారనే ఆరోపణలు.. షాకింగ్ ట్విస్ట్!
Hyderabad Crime: సహాయం చేయడానికి వెళ్లాడు.. క్షణాల్లో ఫోన్ మాయం! హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగతనం.. CCTV చూస్తే షాక్ అవ్వాల్సిందే






