Asia Cup 2023: హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఔరా అనిపించాడు. అద్భుత ప్రదర్శనతో 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. చాన్నాళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియా అభిమానులకు వినాయక చవితి కానుకగా ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆసియా కప్-2023 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. (Asia Cup 2023)
కొలంబోలో మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సాగే కొద్దీ బంతి టర్న్ అయ్యే సూచనలు కనిపించాయి. దీంతో బ్యాటింగ్ ఎంచుకున్నట్లు లంక కెప్టెన్ దసున్ శనక చెప్పాడు. రోహిత్ శర్మ కూడా తాము కూడా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపేవాళ్లమని చెప్పాడు. పైగా ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలుపొందడం విశేషం.
ఇంతలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయ్యింది. కాసేపటికి కవర్లు తీసేశారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం ఉరిమింది. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అటాకింగ్ మొదలుపెట్టాడు. మూడో బంతికే ఓపెనర్ కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బుమ్రా ఇలా శుభారంభం అందించాడో లేదో.. ఇక మన సిరాజ్ వంతు వచ్చింది. అంతే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఇలాంటి పిచ్ మీద సీమర్లు ఇంత గొప్పగా రాణించడం అత్యంత అరుదు. నిజంగా సిరాజ్ అద్భుతం చేశాడంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టడం సిరాజ్ సరికొత్త ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తోంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ముందుగా జస్‌ప్రీత్ బుమ్రా వికెట్ పడగొట్టి శుభారంభం అందించగా.. సిరాజ్ సంచలన స్పెల్(6/21)తో మెరిశాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, మొత్తంగా లంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే ముగించేసింది. ఇషాన్ కిషన్ 23, శుబ్‌మన్ గిల్ 27 పరుగులు రాబట్టగా 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయదుందుబి మోగించింది.
హిట్ మ్యాన్ వన్స్ మోర్
ఆసియా కప్ 2023 గెలుపొందడం ద్వారా చాంపియన్‌గా నిలిచి ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ సొంతం చేసుకుంది టీమిండియా. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో ఇది రెండో ఆసియా కప్ ట్రోఫీ. సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు.
Read Also : MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?