Central Cabinet Changes: కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా దీనిపై కసరత్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రివర్గంలో పలువురికి ఉద్వాసన పలకాలని, మరికొందరు కొత్త ముఖాలకు చోటివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై మొదటి వారంలోనే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పాటు శివసేన (షిండే) గ్రూపునకు, చిరాగ్ పాశ్వాన్ కు, మరికొందరు మిత్రపక్ష పార్టీల ఎంపీలకు కేబినెట్ లో చోటు కల్పించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. (Central Cabinet Changes)
కేంద్ర కేబినెట్ లో మరోసారి ఓబీసీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దపీట వేయబోతున్నట్లు భోగట్టా. జూలై 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు హాజరు కానున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. కేబినెట్ లోకి కొత్తగా తీసుకునే ఎంపీలకు ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు అందింది. కేబినెట్, పార్టీ పునర్ వ్యవస్థీకరణపై ఇటీవల పలు దఫాలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంతోష్ చర్చించారు.
ప్రధాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశాలకు పలువురు ఆర్ఎస్ఎస్ ముఖ్యులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో పాటు పార్టీలోనూ మార్పులు చేసేందుకు ఈ భేటీలో చర్చలు జరిగాయట. కేంద్ర కేబినెట్ లోని మంత్రులతో పాటు కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీలోని కీలక స్థానాల్లో పనిచేస్తున్న నేతల పనితీరుపై మోదీకి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యులు నివేదికలు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలోనూ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో నేతలకు స్థాన చలనం..
మొత్తంగా పార్టీకి దేశ వ్యాప్తంగా మేలు జరిగేలా పునర్ వ్యవస్థీకరణ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నేతలకు స్థాన చలనం కల్పించాలని ప్రధాని మోదీ డిసైడ్ అయ్యారట. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులకు రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించాలని నిర్ణయించినట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక స్టేట్ చీఫ్‌గా ఉన్న ఎంపీ బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు నేడు ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లు , మోర్చాల అధ్యక్షులతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ భేటీ కానున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. మిజోరాంలో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ పై పార్టీ నేతలకు బీజేపీ పెద్దలు దిశానిర్దేశం చేసే చాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రధాన నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. షాడోల్ జిల్లాలో ఎనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.
Read Also : Rahul Gandhi On Telangana Bjp: తెలంగాణలో బీజేపీని తుడిచేస్తాం.. ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక పరంపర!