Rahul Gandhi On Telangana BJP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీని దేశ వ్యాప్తంగా దెబ్బకొడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా ఇటీవల కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. దాని ఫలితంగానే కర్ణాటక రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చేసింది. మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాల పరంపర కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తామని రాహుల్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని తుడిచేస్తామని రాహుల్ దీమా వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో ఫలితాలు నిరూపించాయని, తాము వారిని కేవలం ఓడించలేదని, తుడిచిపెట్టేశామంటూ రాహుల్ చెప్పారు. ఈ మేరకు న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఇదే రిపీట్..!
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. న్యూయార్క్, వాషింగ్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని మాన్‌హాటన్ చేరుకోనున్నారు. కర్ణాటకలో బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని రాహుల్ గుర్తు చేశారు. అయినప్పటికీ.. బీజేపీని కాంగ్రెస్ తుడిచిపెట్టేసిందని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ అదే జరగబోతోందని రాహుల్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తించడం కష్టతరం అవుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. మరో ఆరు నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.
తెలంగాణతోపాటు అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని రాహుల్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించారని, అందుకే ఆ పార్టీ దేశ వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా మూడోసారి గెలిచి హ్యట్రిక్ నమోదు చేయాలని కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది ఎన్నికలు జరిగితేగానీ చెప్పలేని పరిస్థితి ఉంది.
ఇక దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్‌లో జోష్ వస్తోంది. తమ నాయకుడి నుంచి ఇదే కోరుకున్నామని, పార్లమెంటు సభ్యత్వం రద్దుతో బీజేపీపై మరింత వ్యతిరేకత పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ స్వయానా దీనిపై స్పందించారు. అనర్హత వేటు వరకు విషయం వెళ్తుందని ఊహించలేకపోయానని అమెరికా పర్యటనలో వ్యాఖ్యానించారు. బీజేపీ చర్యలు ఏ మాత్రం సహేతుకంగా లేవని, కక్ష సాధింపు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం మినహా దేశానికి చేసిందేమీ లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని రాహుల్ పేర్కొన్నారు. అన్ని పార్టీలూ కలిసి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఒక వైపు భారతీయ జనతా పార్టీ విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్ ప్రేమ పూర్వక సిద్ధాంతాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని రాహుల్ పేర్కొన్నారు.
Read Also : Rahul Gandhi : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాహుల్‌పై అనర్హత వేటు!