Peepal Tree: చెట్లంన్నింటిలో అతి పవిత్రమైనది, పూజ్యనీయమైనది రావిచెట్లు. దీన్నే పురాణ కాలంలో అశ్వత్థ వృక్షం అని పిలిచేవారు. ప్రస్తుత నవీన యుగంలో రావిచెట్టును మహిళలు దైవ సమానంగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రావి చెట్టంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. అందుకే వేడుకల సమయంలోనూ, ప్రత్యేక సందర్భాల్లో కూడా రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. పెళ్లయిన దంపతులు కూడా రావి చెట్టును పూజించి దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుంటారు. (Peepal Tree)
ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరిచెట్టు, విజయదశమి రోజున శమీవృక్షానికి పూజలు చేయడం మన సంస్కృతిలో భాగంగా వస్తున్నాయి. మరోవైపు రావిచెట్టును నిత్యం పూజించే చెట్టుగా ఉంటుంది. మన పూర్వీకులు అనేక గ్రంథాల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కారణంగానే దేవాలయ ప్రాంగణంలో గల రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ, పూజలు నిర్వహిస్తూ కనిపిస్తుంటారు.
రావిచెట్టును త్రిమూర్తుల స్వరూపంగా కూడా భావించి పూజిస్తారు. అశ్వత్థ వృక్షాన్ని చూడగానే సహజంగానే అందరిలో భక్తి భావన కలుగుతుంది. సువిశాలంగా విస్తరించి చక్కటి ఆకుల శబ్ధంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రావి చెట్టు ఎక్కడుంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు. రావిచెట్టు దేవతావృక్షం కాబట్టి చాలా ఆలయాల పరిసరాల్లో దీన్ని గమనించవచ్చు.
శనివారం మాత్రమే తాకాలి..
రావిచెట్టుకు మనసులోని కోర్కెలు చెప్పుకొని భక్తితో పూజిస్తే అవి నెరవేరుతాయని ప్రతీతి. పూజలు నిర్వహించడంతోపాటు రావిచెట్టుకు నిత్యం ప్రదక్షిణలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయట. ఇది అనేక మంది విశ్వసించే అంశం. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే, ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రావిచెట్టును మిగతా రోజుల్లోకంటే శనివారం మాత్రమే పూజలు చేయాలని చెబుతున్నారు. మిగతా రోజుల్లో తాకితే దోషం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. శనివారం తాకి పూజించడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Spiritual Plants: ఈ చెట్లను పూజిస్తే.. ధనవంతులు కావడం గ్యారెంటీ!