Prakash raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రాజకీయాలు, మత అంశాలపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన.. తాజాగా రామాయణంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కేరళలో జరిగిన ఓ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన దేవుడిగా శ్రీరాముడిని భావిస్తారు. రామాయణం భారతీయ సంస్కృతిలో కీలకమైన ఇతిహాసంగా గుర్తింపు పొందింది. అలాంటి రామాయణాన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంపై అనేక హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేరళ సాహిత్య ఉత్సవంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. రామాయణ కథను వ్యంగ్యంగా చెబుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలు అని, వారు దక్షిణ భారతానికి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ సందర్భాన్ని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి రెండు వేల డాలర్లు కట్టాలని అడిగిందని కూడా ఆయన ఎద్దేవా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రామాయణం వంటి పవిత్ర ఇతిహాసాన్ని వక్రీకరించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మతపరమైన భావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా, కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ దేశంలో మత రాజకీయాలపై కూడా విమర్శలు చేశారు. దేశంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు జరుగుతున్నాయని, ముస్లింలు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. పలువురు నెటిజన్లు ఆయనను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలు స్వేచ్ఛా భావప్రకటనలో భాగమని అభిప్రాయపడుతున్నారు.
ఇక కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన నటిస్తున్న సినిమాలపై కూడా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఆయనను తీసుకునే విషయంలో చిత్రనిర్మాతలు పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి వారు తమ ప్రాజెక్టుల నుంచి ఆయనను తప్పించాలని కూడా పోస్టులు చేస్తున్నారు.
మొత్తంగా ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే ఈ వివాదం మరింత ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది.
ఇవీ చదవండి: GV Prakash : జీవీ ప్రకాశ్ సిస్టమ్ స్టార్ హీరోయిన్ అని మీలో ఎంత మందికి తెలుసు?
Actor Prakash Raj: లడ్డూ ఇష్యూపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు
