Tirumala Info : తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఐదు చిరుతలను పట్టుకున్నట్లు వెల్లడించారు. భక్తుల భద్రత కోసం పెద్దపీట వేస్తున్నామని భూమన స్పష్టీకరించారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూస్తామన్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు. భక్తులకు భద్రతా సిబ్బంది ధైర్యాన్ని నింపుతున్నారని భూమన తె లిపారు. (Tirumala Info)
మధ్యాహ్నం తర్వాత చిన్న పిల్లలకు అనుమతి లేదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే కర్రల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. కర్రల పంపిణీ పై అసభ్యకరంగా దూషిస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. కర్రలు ఇచ్చి మేం చేతులు దులుపుకోలేదని స్పష్టం చేశారు. భక్తులకు తోడుగా భద్రతా సిబ్బంది ఉన్నారని భరోసా ఇచ్చారు.
300 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారని భూమన తెలిపారు. భక్తులకు భరోసా కల్పించడానికే ఊతకర్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. మా పై విమర్శలు చేసినా భక్తుల భద్రతపై రాజీ పడేది లేదని టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. మరోవైపు చిన్నారి లక్షిత పై దాడి చేసింది ఏ చిరుత అన్నదాని పై ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే 4 చిరుతల గోళ్లు, వెంట్రుకలు శాంపిల్స్ ల్యాబ్ కి అధికారులు పంపారు. ల్యాబ్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.
తిరుమలలో చిక్కిన మరో చిరుత
తిరుమలలో ఐదో చిరుత చిక్కింది. చిరుతను బంధించిన అటవీ శాఖ అధికారులు.. జూకి తరలించారు. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలకు చిరుత చిక్కింది. నరసింహ స్వామి ఆలయం, 7వ మైలు మధ్యలో చిరుతను అటవీ శాఖ అధికారులు ట్రాప్ చేశారు. చిరుత ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
చిరుతను క్వారంటైన్ కి తరలిస్తాం : డీఎఫ్ వో సతీష్ రెడ్డి
చిరుతను క్వారంటైన్ కి తరలిస్తామని డీఎఫ్‌వో సతీష్ రెడ్డి తెలిపారు. దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు శ్యాంపిల్స్ పంపామన్నారు. నివేదిక వచ్చాక నిర్ధారణ చేస్తామన్నారు. నడకదారి వైపున వన్యప్రాణుల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 2 నడక మార్గాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
నేడు గోకులాష్టమి
తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు మాడవీధులలో ఉట్లోత్సవం ఉంటుందని టీటీడీ తెలిపింది. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Read Also : Weather Report today 07-09-2023: కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన