Weather Report today 07-09-2023: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్ గడ్ వద్ద ఇవాళ తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కోస్తా జిల్లాల్లో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం విధించినట్లు తెలిపారు. (Weather Report today 07-09-2023)
దక్షిణ ఛత్తీస్ గఢ్ పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
దక్షిణ ఛత్తీస్ గఢ్ పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఏపీలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగనుంది.
గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది. మూడు డెల్టా కాల్వలకు 13,800 క్యూసెక్కులు విడుదల చేశారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 2.31 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.
భారీ వర్షానికి ఉప్పొంగిన వరహాలు గెడ్డ, సాకిగెడ్డ
పార్వతీపురంలో భారీ వర్షం కురుస్తోంది. వరహాలు గెడ్డ, సాకిగెడ్డ ఉప్పొంగాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. సాకిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 39,851 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నిల్ గా నమోదైంది. ప్రస్తుత నీటిమట్టం 852 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. మరోవైపు కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయానికి వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 16,240 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12,831 క్యూసెక్కులుగా నమోదైంది. సుంకేశుల జలాశయం 3 గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: Weather today 06-09-2023: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం